ధర్మారావుపేటలో వీధికుక్కల బీభత్సం.. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు
కామారెడ్డి, ఆగస్టు 24: సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామంలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న ఇద్దరు పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన వీధికుక్క ఇద్దరు పిల్లలపై దాడి చేసి కరిచింది. పిల్లల కేకలు విన్న తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను తరిమికొట్టారు.
తీవ్ర గాయాలపాలైన పిల్లలను కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల జిల్లాలో వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి. బాన్సువాడలో వీధికుక్క దాడి చేసి 20 మందికి పైగా గాయపరిచిన ఘటన మరువకముందే తాజా ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలను బయటకు పంపాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నా మున్సిపల్, పంచాయతీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధికుక్కల నివారణకు చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.



Post a Comment