జువాలజీ, సివిక్స్ పాఠాలు అర్థం కావడం లేదంటూ ఆవేదన - లెక్చరర్ల నియామకంలో జాప్యంపై ఆగ్రహం
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు శనివారం నిరసనకు దిగారు. కళాశాల ముందు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జువాలజీ, సివిక్స్ తదితర సబ్జెక్టుల బోధన సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, సందేహ నివృత్తి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సబ్జెక్టులపై స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
సంవత్సరం గడుస్తున్నా లెక్చరర్లను నియమించడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిరోజూ బయట ప్రైవేట్ క్లాసులకు వెళ్లాల్సి వస్తోందని, తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.
సుమారు రెండు గంటల పాటు ఎండలోనే కళాశాల ముందు బైఠాయించి నిరసన కొనసాగించారు. తక్షణమే నూతన లెక్చరర్లను నియమించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా నోడల్ అధికారి సలాం స్పందిస్తూ ఐదు రోజుల్లో లెక్చరర్లను నియమిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయితే సంవత్సరంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రిన్సిపాల్ ఐదు రోజుల్లో ఎలా నియమిస్తారని విద్యార్థులు నిలదీశారు. శాశ్వత పరిష్కారం అయ్యేంత వరకు నిరసన విరమించేది లేదని తేల్చి చెప్పారు.

Post a Comment