Top News

Water increase in Projects |జిల్లా ప్రాజెక్టులకు జల కళ!

జిల్లా ప్రాజెక్టులకు జల కళ!

12 టీఎంసీల మార్క్ దాటిన నిజాంసాగర్

పూర్తిస్థాయి నీటి మట్టానికి  చేరిన కౌలాస్ నాలా

పొంగి పొర్లుతున్న పోచారం ప్రాజెక్టు 

రైతుల్లో హర్షం

కామారెడ్డి:  ఎగువ నుంచి వస్తున్న వరదలతో కామారెడ్డి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు వేగంగా నింటున్నాయి. నిజాంసాగర్ 12 టీఎంసీలు దాటగా, కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరింది. పోచారం ప్రాజెక్టు నుంచి నీరు పొంగి పొర్లుతోంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద రావడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 12. 12 టీఎంసీలకు చేరింది. మంగళవారం సాయంత్రానికి 1545 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని ప్రాజెక్టు ఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం 1400 అడుగుల వద్ద 12.007 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 1405 అడుగులు, 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు దాదాపు 65% నిండింది. వరద ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో ఫుల్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

పూర్తిస్థాయికి చేరిన కౌలాస్ నాలా

మరమ్మతుల కారణంగా డెడ్ స్టోరేజీకి చేరిన జుక్కల్ కొలాస్ నాలా ప్రాజెక్టు, వరుస వర్షాలతో తిరిగి నిండుకుండలా మారింది. ప్రస్తుతం 457.40 అడుగుల వద్ద 1.095 టీఎంసీల నీరు ఉంది. పూర్తిస్థాయి 458 అడుగులు, 1.237 టీఎంసీలు. మంగళవారం 140 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైందని ఈఈ సుకుమార్ రెడ్డి చెప్పారు. గతంలో నీటి కొరతతో ఆందోళన చెందిన రైతులు, ఇప్పుడు ప్రాజెక్టు నిండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పోచారం, కళ్యాణి, సింగితం కూడా నిండాయి

జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది.  

- పోచారం ప్రాజెక్టు: పూర్తిస్థాయికి చేరడంతో గేట్ల ద్వారా నీరు పొంగి పొర్లుతోంది

-కళ్యాణి రిజర్వాయర్: నీరు నిండటంతో గేట్లు ఎత్తివేశారు  

-సింగితం రిజర్వాయర్: పూర్తిస్థాయి నీటితో గేట్లు ఎత్తివేశారు

జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండటంతో ఈ ఏడాది ఆయకట్టుకు సాగునీటి ఇబ్బంది ఉండదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరుస వర్షాలతో ప్రాజెక్టులు నిండటంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post