కాంగ్రెస్ పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం
17న ప్రతి తండాలో నిరసనకు బీఆర్ఎస్ పిలుపు - బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడలో బీఆర్ఎస్‌లో చేరికలు
బాన్సువాడ, సెప్టెంబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1000 రోజులు పూర్తయినా గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బాన్సువాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. మంగళవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
1000 రోజుల్లో శూన్యం - కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజం:
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల ఓట్లతో గెలిచి, అధికారంలోకి వచ్చాక వారినే మరచిపోయిందని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న భూములను లాక్కొని గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాదాపు మూడేళ్లు కావస్తున్నా గిరిజనుల సంక్షేమానికి ఒక్క పైసా, ఒక్క పథకం కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
17న ప్రతి తండాలో నిరసన దీక్ష:
గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 17వ తేదీన బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి తండాలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. తండాల్లోని ప్రతి గిరిజన బిడ్డ కాంగ్రెస్ మోసాన్ని తెలుసుకోవాలని, పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనులకు స్వర్ణయుగం:
బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనులకు నిజమైన న్యాయం జరిగిందని గోవర్ధన్ గుర్తు చేశారు.
- రూ.28 వేల కోట్లు:రెండేళ్లలోనే గిరిజన సంక్షేమానికి కేసీఆర్ రూ.28 వేల కోట్లు కేటాయించారు.
- రిజర్వేషన్ 6% నుంచి 10%కి: ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌దే.
- 56 వేల ఎకరాల సాగు:56 వేల ఎకరాల బంజరు భూములను సాగులోకి తెచ్చి గిరిజనులకు అండగా నిలిచారు.
- విద్య, ఉపాధి: ఎస్టీలకు ఐఐటీ స్టడీ సర్కిల్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, మౌలిక వసతుల కోసం వెయ్యి కోట్లు, గిరిజన మహిళలకు T-Hub ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారు.
- బాన్సువాడ అభివృద్ధి: బాన్సువాడ నియోజకవర్గంలో 57 నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి తండాలకు పాలనను చేరువ చేశారు.
వివిధ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి గిరిజనులకు నిధులు అందించిన బీఆర్ఎస్‌కు, ఒక్క పైసా కూడా ఇవ్వని కాంగ్రెస్‌కు తేడా ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రూ.4 లక్షల కోట్ల అప్పు - అభివృద్ధి శూన్యం:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు రూ.4 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, అయినా ఒక్క కొత్త పథకం కూడా అమలు చేయలేదని, ఉన్న హామీలను విస్మరించిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా కష్టపడ్డామో, ఇప్పుడు ప్రజల హక్కుల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇందులో గిరిజనులే ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్‌లో చేరికలు:
ఈ సందర్భంగా పులికుచ్చ తాండాకు చెందిన మాజీ సర్పంచ్ సహా పలువురు నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ అంజిరెడ్డి, మోరల్ శ్రీనివాస్ రావు, జుబేర్, మొగులయ్య, ఖలీల్, ఫెరోజ్, ఇసాక్, రైటర్ రాజు, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





Post a Comment