లక్షలో ఒక్కరికి ఉండే బాంబే రక్తం దానం - ముస్లిం మహిళ ప్రాణం నిలిపిన హిందూ యువకుడు
మతానికి అతీతంగా మానవత్వం - 8 రోజులుగా రక్తం కోసం ఎదురుచూస్తున్న మహిళకు ప్రాణం పోసిన లక్ష్మణ్
అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ దానం చేసిన డిచ్‌పల్లి యువకుడు - మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘటన
నిజామాబాద్, సెప్టెంబర్ 04:
మత ఘర్షణలు, విద్వేషాలు చెలరేగుతున్న ప్రస్తుత సమాజంలో మానవత్వమే గొప్పదని నిరూపించాడు డిచ్‌పల్లి మండలానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు. లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ (hh)రక్తాన్ని దానం చేసి ఒక ముస్లిం మహిళ ప్రాణాలను కాపాడాడు.
అసలు ఏం జరిగిందంటే:
బోధన్ కు చెందిన రిజ్వానా అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చికిత్సలో భాగంగా ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరమైంది. పరీక్షలు చేయగా ఆమెది బాంబే బ్లడ్ గ్రూప్ (hh) అని తేలింది.
ఈ గ్రూప్ ప్రపంచంలోనే అత్యంత అరుదైనది. సాధారణంగా లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఈ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ ఉన్నవారికి ఇదే గ్రూప్ రక్తం మాత్రమే ఎక్కుతుంది. వేరే ఏ గ్రూప్ రక్తం పనికిరాదు. ఈ గ్రూప్ రక్తం ప్రపంచంలోనే సుమారు 20 వేల మందికి, ఇండియా లో వేయి మందికి ఉందని సమాచారం.
దీంతో ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు 8 రోజుల పాటు ఎక్కడెక్కడో వెతికినా రక్తం దొరకలేదు. మహిళ పరిస్థితి విషమించింది.
ఈ విషయం తెలుసుకున్న ఎస్బీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వారు వెంటనే స్పందించారు. వారు సహారా యూత్ గ్రూప్ చైర్మన్ మీర్జా అహ్మద్, షేక్ సల్మాన్ సమాజ సేవా సంస్థను సంప్రదించారు. సల్మాన్ తన నెట్ వర్క్ ద్వారా వెతకగా డిచ్‌పల్లి మండలంలో లక్ష్మణ్ అనే యువకుడికి బాంబే బ్లడ్ గ్రూప్ ఉందని తెలిసింది.
వెంటనే లక్ష్మణ్ ను సంప్రదించగా, అతను ఏమాత్రం ఆలోచించకుండా రక్తదానానికి ముందుకు వచ్చాడు. కులం, మతం చూడకుండా శుక్రవారం నాడు ఎస్ బి బ్లడ్ బ్యాంకు కు వెళ్లి తన రక్తాన్ని దానం చేశాడు. దీంతో రిజ్వానా ప్రాణాలకు ముప్పు తప్పింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.Video 👇
మానవత్వానికి నిదర్శనం:
హిందూ-ముస్లిం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న వేళ, ఒక హిందూ యువకుడు ముస్లిం మహిళకు రక్తం ఇచ్చి ప్రాణం నిలపడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. రక్తానికి మతం లేదు, మానవత్వమే మతం అని లక్ష్మణ్ నిరూపించాడు అంటూ స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు అభినందిస్తున్నాయి.
ఈ అరుదైన రక్తదానం పై బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు లక్ష్మణ్ ను ఘనంగా సత్కరించారు.




Post a Comment