Top News

Lok Adalath | 11 మోటార్ ప్రమాద కేసుల్లో రూ.1.17 కోట్ల పరిహారం

కామారెడ్డిలో ఘనంగా జాతీయ లోక్ అదాలత్ - 11 మోటార్ ప్రమాద కేసుల్లో రూ.1.17 కోట్ల పరిహారం

కక్షల నుంచి కలయిక వైపు లోక్ అదాలత్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముక్తిద

కామారెడ్డి, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ఘనంగా నిర్వహించారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి & జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి పి. ముక్తిద ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లోక్ అదాలత్ అనేది ప్రజా న్యాయస్థానమని, త్వరితగతిన, తక్కువ ఖర్చుతో న్యాయం అందించే సమర్థవంతమైన ప్రత్యామ్నాయ వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ అవార్డు తుది తీర్పుతో సమానమని, దానిపై అప్పీల్ ఉండదని, రాజీ మార్గంలో పరిష్కారం వల్ల కుటుంబ, సామాజిక సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయని తెలిపారు.

జిల్లాలో మొత్తం 6 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి సివిల్, క్రిమినల్, బ్యాంక్ రికవరీ, కుటుంబ, వివాహ సంబంధిత రాజీకి అనుకూలమైన కేసులను పరిష్కరించారు.

11 ప్రమాద కేసుల్లో రూ.1,17,66,000 పరిహారం:

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా 11 మోటార్ వాహన ప్రమాద కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయి. మృతుల కుటుంబ సభ్యులు, గాయపడిన బాధితులకు కలిపి మొత్తం రూ.1,17,66,000/- పరిహారంగా అవార్డు మంజూరు చేశారు.

పోక్సో బాధితులకు పరిహారం:

అనంతరం నిజాంసాగర్, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు పోక్సో బాధితులకు ఒకరికి రూ.2 లక్షలు, మరొకరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.

లోక్ అదాలత్ కు హాజరైన సుమారు 300 మంది కక్షిదారులకు DLSA ఆఫీస్ అసిస్టెంట్ జె. సాయి ప్రణీత్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో DLSA కార్యదర్శి టి. నాగరాణి అధ్యక్షత వహించారు. సీనియర్ సివిల్ జడ్జి డా. సూర సుమలత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి. దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ, సూపరింటెండెంట్లు వెంకట్ రెడ్డి, చంద్రసేన్ రెడ్డి, వివిధ బ్యాంకుల అధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post