Top News

Murder Case | భూమి డబ్బుల వివాదంలో ప్రియురాలిని ఇనుప రాడ్ తో కొట్టి హత్య

లింగంపేట్ హత్య కేసు ఛేదింపు - నిందితుడు సాయిలు అరెస్ట్

భూమి డబ్బుల వివాదంలో ప్రియురాలిని ఇనుప రాడ్ తో కొట్టి హత్య - సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్ ఫోన్, రక్తపు మరకల దుస్తులు స్వాధీనం - వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు

కామారెడ్డి, సెప్టెంబర్ 21: లింగంపేట్ మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసును కామారెడ్డి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ప్రియురాలిని ఇనుప రాడ్ తో దాడి చేసి హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడిస్తూ... లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారు నాగారం గ్రామానికి చెందిన చింతకుంట చంద్రవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదురాలి కుమార్తె గత 10 సంవత్సరాలుగా కొరుపోలు గ్రామానికి చెందిన గుట్టమీది సాయిలు (48), తండ్రి గంగయ్యతో సహజీవనం చేస్తూ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అయితే హైదరాబాద్ లోని గుండ్లపోచమ్మ వద్ద ఉంటున్న ఆమెను తన గ్రామానికి రావాలని, రాకపోతే చంపేస్తానని సాయిలు పలుమార్లు ఫోన్ లో బెదిరించాడు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాలని చెప్పి ఆమె గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరింది. ఆ తర్వాత నాగారం గ్రామ శివారులో తలకు బలమైన గాయంతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందడంతో తల్లి లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఈ కేసును జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి సారథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో...

సెప్టెంబర్ 19 ఉదయం 11 గంటలకు భూమి డబ్బుల విషయమై నిందితుడు సాయిలు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లి జుబేర్ అనే వ్యక్తితో మాట్లాడించాడు. అనంతరం ఇద్దరూ సాయంత్రం 5 గంటలకు మృతురాలి పొలం వద్దకు చేరుకున్నారు. అక్కడ మాట్లాడుకుంటున్న క్రమంలో తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో ఆమె తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందిందని నిందితుడు విచారణలో ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, ఒక OPPO సెల్ ఫోన్, రక్తపు మరకలున్న అంగీని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.

ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర  అభినందించారు.

హత్యకు గురైన మహిళ (ఫైల్ )


Post a Comment

Previous Post Next Post