SP Visit to Banswada | బాన్సువాడలో నిమజ్జన రూట్ పరిశీలించిన ఎస్పీ రాజేష్ చంద్ర






బాన్సువాడలో గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

• బాన్సువాడ పట్టణంలోని గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ

• గణేష్ నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని ప్రత్యేక బస్సులో క్షేత్రస్థాయిలో పరిశీలన

• కల్కి చెరువు నిమజ్జన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

• బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు

• పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ

• బాన్సువాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో గణేష్ ఉత్సవాలపై సమీక్ష

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:  పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర శుక్రవారం బాన్సువాడలో పర్యటించారు.

ముందుగా జిల్లా ఎస్పీ  బాన్సువాడ పట్టణంలోని గణేష్ మండపాలను సందర్శించారు. గణేష్ విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

అనంతరం జిల్లా ఎస్పీ  సంబంధిత శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులతో కలిసి ప్రత్యేక బస్సులో గణేష్ నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత బాన్సువాడ చావిడి నుంచి సంగమేశ్వర్ కాలనీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, తాడుకోల్ చౌరస్తా, గోల్డ్ షాప్, గాంధీ చౌక్, జండా గల్లి మీదుగా కల్కి చెరువు నిమజ్జన ప్రాంతం వరకు రూట్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా శోభాయాత్ర మార్గంలోని రోడ్ల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ వైర్లు, లైటింగ్, పారిశుద్ధ్యం, బారికేడింగ్, భక్తుల భద్రత తదితర అంశాలను పరిశీలించారు. నిమజ్జనానికి ముందుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కల్కి చెరువు నిమజ్జన ప్రాంతంలో భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ బృందాలు, గజఈతగాళ్లు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఎస్పీ  సూచించారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టాలని తెలిపారు.

రూట్ పరిశీలన అనంతరం బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి జిల్లా ఎస్పీ  ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని గణేష్ ఆశీస్సులు పొందారు.

అనంతరం బాన్సువాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందించి, అనంతరం పోలీస్ అధికారులు, ప్రజలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ మరియు సిబ్బందితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ.. “కామారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రజల్లో ఉండే ఆత్మీయత, పరస్పర సహకారం, ఐకమత్యం జిల్లా ప్రత్యేకతకు అద్దం పడతాయి. అధికారులు, సిబ్బంది పరస్పరం సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి” అని సూచించారు.

అనంతరం బాన్సువాడ రూరల్ పోలీస్ కార్యాలయంలో బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలతో జిల్లా ఎస్పీ  సమీక్ష సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, సున్నిత ప్రాంతాల పర్యవేక్షణ, రద్దీ ప్రాంతాల్లో భద్రత, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ.. “గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడటం పోలీస్ శాఖ ప్రథమ బాధ్యత. ప్రతి అధికారి తమ పరిధిలోని పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి” అని సూచించారు.

పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీలు, ప్రజలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని, నిమజ్జన శోభాయాత్ర మార్గాలు, ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలు, నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మరియు అమలులో ఉన్న నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

జిల్లా ప్రజలందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో జరుపుకోవాలని, మండప నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, మార్గదర్శకాలను తప్పకుండా పాటించి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

“భక్తి, భద్రత, బాధ్యత” అనే సూత్రాన్ని పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన, ఆనందదాయకమైన వాతావరణంలో విజయవంతం చేద్దామని జిల్లా ఎస్పీ  పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు,ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, డీఎస్పీ విఠల్ రెడ్డి, సి ఐ శ్రీధర్, రూరల్ సీఐ, పోలీస్ సిబ్బంది, నాయకులు నాగులగామ వెంకన్న, మహ్మద్ ఏజాస్, వహాబ్ , ఎర్వల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

"డీజేలు వద్దు.. సహకరించండి"

 "నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలు ఏర్పాటు చేయరాదు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహరించండి. భక్తులు పోలీసులకు సహకరించాలి. అన్ని విధాలా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తాం."

- రాజేష్ చంద్ర, జిల్లా ఎస్పీ















Post a Comment

Previous Post Next Post