నిజామాబాద్ లో దారుణ హత్య
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్ ఆర్.ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై కత్తితో దాడి
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు - దర్యాప్తు ప్రారంభం
CCTV వీడియో వైరల్
నిజామాబాద్, సెప్టెంబర్ 17 : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త హరిబాబు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్.ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు.
అందుతున్న వివరాల ప్రకారం.. హరిబాబు నిల్చుండగా, కారులో వచ్చిన ఓ దుండగుడు అతడిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హరిబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఘటనతో ఆర్.ఆర్ చౌరస్తా వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పాత కేసు నేపథ్యం:
కొన్ని నెలల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ లో యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైన కేసులో హరిబాబు నిందితుడిగా ఉన్నాడు. వైష్ణవి నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో అదనపు కట్నం విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అప్పట్లో వెల్లడించారు. అనంతరం హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ప్రస్తుతం అదే హరిబాబు నిజామాబాద్ లో నడిరోడ్డుపై హత్యకు గురికావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు, పాత కేసుతో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. CC TV Footage 👇
నిజామాబాద్ హరిబాబు హత్యలో ట్విస్ట్
హరిబాబును నేనే చంపానని వైష్ణవి సోదరుడి వీడియో విడుదల
నిజామాబాద్ ఆర్.ఆర్ చౌరస్తాలో హరిబాబు హత్య కేసులో కీలక మలుపు. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే చంపానని ఆమె సోదరుడు సంతోష్ వీడియో విడుదల చేశాడు.
గర్భవతి అని చూడకుండా చెల్లిని చంపినందుకు ప్రతీకారంగానే హత్య చేశానని, ఇక ఏ ఆడబిడ్డకు ఇలా జరగకూడదని వీడియోలో చెప్పాడు. తాను పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
గత ఏడాది సెప్టెంబర్ 17న వైష్ణవి హరిబాబు చేతిలో హత్యకు గురికాగా, సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు హరిబాబు హత్యకు గురవడం సంచలనంగా మారింది.

Post a Comment