మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాలపై సమీక్ష - గణేష్ ఉత్సవాల్లో షీ టీమ్స్ తో నిరంతర నిఘా
కామారెడ్డి, సెప్టెంబర్ 09: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా షీ టీమ్స్ నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆయన ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షీ టీమ్స్, భరోసా బృందం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), POSH కమిటీ సభ్యులు, DCRB డీఎస్పీ గట్టుమల్లు, DCRB బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గణేష్ మండపాలు, ఉత్సవ ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే రద్దీ ప్రాంతాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. మహిళలను వేధించే ఆకతాయిలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
భరోసా బృందం ద్వారా బాధిత మహిళలకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయపరమైన సహాయం, భద్రతపై ఆరా తీశారు. బాధితుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని, వారిలో భద్రతా భావాన్ని పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.
కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు POSH చట్టం అమలు, ఫిర్యాదుల స్వీకరణపై సమీక్షించారు. షీ టీమ్స్, భరోసా, AHTU, POSH కమిటీలు మరియు DCRB పరస్పర సమన్వయంతో పనిచేస్తూ మహిళల రక్షణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, DCRB డీఎస్పీ గట్టుమల్లు, సంబంధిత అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




Post a Comment