Shabbir Ali | కామారెడ్డి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

కామారెడ్డి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, సెప్టెంబర్ 18: కామారెడ్డి పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 15, 16వ వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.

వార్డుల్లో ప్రజలను నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. "కామారెడ్డి అభివృద్ధి నా వ్యక్తిగత బాధ్యత. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు మెరుగుపడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది" అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసినప్పటి నుండి ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, కామారెడ్డి ప్రజలు ఇచ్చిన ప్రేమను ప్రభుత్వం మరచిపోదని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని.. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

వార్డుల్లో చేపట్టిన పనుల్లో నాణ్యత విషయంలో రాజీ ఉండకూడదని, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రియాంక, వనిత, అంజాద్, వాజీద్ తదితరులు, కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.








Post a Comment

Previous Post Next Post