Top News

SIR Inspection | ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ వి. విక్టర్

బురుగుల్, గునుకుల్ లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ వి. విక్టర్

పారదర్శకంగా, పకడ్బందీగా ఎస్‌ఐఆర్ నిర్వహించాలి - అధికారులకు ఆదేశం

మహ్మద్‌నగర్, సెప్టెంబర్ 12: కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్ మండలంలోని బురుగుల్, గునుకుల్ గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

బురుగుల్, గునుకుల్ గ్రామాల్లోని 238, 241 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మహ్మద్‌నగర్ తహసీల్దార్ తో కలిసి ఎస్‌ఐఆర్ పనుల పురోగతిని సమీక్షించారు. గునుకుల్ గ్రామంలో ఓటర్ల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, సంబంధిత పత్రాలను పరిశీలించి వివరాల నమోదు తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ, పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు.

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పేర్లను గుర్తించి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎస్‌ఐఆర్ పై అవగాహన కల్పించి, ఓటర్లు సమర్పించాల్సిన పత్రాలపై వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.

అనంతరం బురుగుల్ గ్రామంలోని టీకాల కేంద్రాన్ని కూడా అదనపు కలెక్టర్ సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్‌నగర్ తహసీల్దార్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post