గణేష్ నవరాత్రుల వేళ సైబర్ భద్రతపై కామారెడ్డి పోలీసుల వినూత్న ప్రచారం
"వినాయకుడు నేర్పే పాఠాలతో సైబర్ విజ్ఞానం" పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 03:
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కామారెడ్డి జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. "వినాయకుడు మనకు నేర్పే పాఠాలు - సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి" అనే నినాదంతో రూపొందించిన ప్రత్యేక సైబర్ అవగాహన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వినాయకుడు జ్ఞానం, వివేకానికి ప్రతీక అని, అదే స్ఫూర్తితో సైబర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వినాయకుడి రూపంలో సైబర్ సందేశాలు:
పెద్ద చెవులు: అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లను జాగ్రత్తగా వినండి.
చిన్న కళ్ళు: ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతిదీ నమ్మకుండా పరిశీలించండి.
అభయహస్తం: అనుమానాస్పద లింకులు, యాప్‌లు, QR కోడ్‌లను క్లిక్ చేయవద్దు.
మూషిక వాహనం: మొబైల్, ఇంటర్నెట్‌ను బాధ్యతాయుతంగా వాడండి.
మోదకం: PIN, OTP, పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలను ఎవరికీ చెప్పవద్దు.
కలం: ఆన్‌లైన్ లావాదేవీలను నమోదు చేసుకుని అనుమానం వస్తే వెంటనే స్పందించండి.
గణేష్ ఉత్సవాల సమయంలో ఫేక్ విరాళాల పేరుతో QR కోడ్‌లు పంపడం, నకిలీ ఉత్సవ కమిటీల పేరుతో డబ్బులు అడగడం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, నకిలీ కస్టమర్ కేర్, OTP, UPI మోసాలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
"ముందుగా ఆలోచించండి - తర్వాత క్లిక్ చేయండి. మీ అప్రమత్తతే మీ సైబర్ రక్షణ కవచం" అని పిలుపునిచ్చారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా http://www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.




Post a Comment