36 గంటల్లో దోపిడీ కేసు ఛేదింపు - ముగ్గురు దొంగల అరెస్ట్
సీసీ కెమెరాలతో దొరికిన దోపిడీ ముఠా - నాగిరెడ్డిపేట పోలీసుల ప్రతిభ
దంపతులను బెదిరించి చోరీ - పోచారం చెక్ పోస్ట్ వద్ద పట్టుబడిన నిందితులు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 03:
నాగిరెడ్డిపేటలో జరిగిన దోపిడీ కేసును కేవలం 36 గంటల్లో పోలీసులు ఛేదించారు. దంపతులను మాయమాటలు చెప్పి, బెదిరించి నగదు, వెండి గొలుసు దోచుకుని పరారైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 31న మధ్యాహ్నం 12:30 గంటలకు గోపాల్ పేట్ లోని దత్తు హాస్పిటల్ ఎదుట పొచమ్మర గ్రామానికి చెందిన దంపతులను ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి బెదిరించి వారి వద్ద ఉన్న 12 తులాల వెండి గొలుసు, రూ.15 వేల నగదు లాక్కొని జూపిటర్ స్కూటీపై మెదక్ వైపు పారిపోయారు.
బాధితుల ఫిర్యాదుతో నాగిరెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్ఐ భార్గవ్ గౌడ్ లు రెండు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు.
వివిధ ప్రాంతాల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, విశ్వసనీయ సమాచారంతో నిందితుల కదలికలను గుర్తించారు. సెప్టెంబర్ 02న నిందితులు తిరిగి నాగిరెడ్డిపేట మండలం వైపు వస్తున్నారనే సమాచారంతో పోచారం చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 12 తులాల వెండి గొలుసు, రూ.15 వేల నగదు, నంబర్ ప్లేట్ లేని జూపిటర్ స్కూటీ, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి సెప్టెంబర్ 02 రాత్రి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
ఈ కేసును వేగంగా ఛేదించిన ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజారెడ్డి, ఎస్ఐ భార్గవ్ గౌడ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.




Post a Comment