Top News

Theft Case | బోర్ మోటార్ కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్

బోర్ మోటార్ కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్

భిక్నూర్ పోలీసుల ఘనత

రైతుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

సీసీ కెమెరాలతో నిందితుల గుర్తింపు

భిక్నూర్ / కామారెడ్డి, సెప్టెంబర్ 05: కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న బోర్ మోటార్ కేబుల్ వైర్ల దొంగల ముఠాను భిక్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌ఓ ఎస్. అనిల్ వెల్లడించారు.

అంతంపల్లి గ్రామానికి చెందిన జీడి భీమయ్య తన పొలంలోని గదిలో ఉన్న బోర్ మోటార్ స్టార్టర్ బాక్స్ కేబుల్ వైర్లను 03-09-2026 రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి దొంగిలించారని ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల పొలాల్లోనూ ఇదే తరహా చోరీలు జరగడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాలతో, కామారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో భిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఎస్‌హెచ్‌ఓ అనిల్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.

నిందితులు రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లి తాళాలు పగలగొట్టి కేబుల్ వైర్లను కట్టర్ తో కట్ చేసి ఎత్తుకెళ్లేవారు. వాటిని పెట్రోల్ తో కాల్చి రాగి తీగలను వేరు చేసి స్క్రాప్ షాపుల్లో అమ్మి డబ్బులు పంచుకునేవారని విచారణలో తేలింది. ఉగ్రవాయి, బస్వాపూర్, అంతంపల్లి శివార్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

దొంగిలించిన రాగి తీగలను అమ్మి డబ్బు పంచుకున్న తర్వాత మళ్లీ చోరీకి వెళ్తుండగా భిక్నూర్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని CCS కామారెడ్డి కానిస్టేబుళ్లు స్వామి, మైసయ్య, చేతన్, శ్రీకాంత్, భిక్నూర్ కానిస్టేబుళ్లు సంగమేశ్వర్, సేవ్య, కిషన్, శ్రీకాంత్ అప్రమత్తంగా అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రాగి తీగలు, కట్టర్లు, ఇనుప రాడ్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.



Post a Comment

Previous Post Next Post