పిట్లంలో ఫుడ్ పాయిజన్ కలకలం - మేక మాంసం తిని 8 మందికి అస్వస్థత
అన్నారం తండాలో దసరా విందు వికటించి... వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలు
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స - పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
బాన్సువాడ, 19 అక్టోబర్: పిట్లం మండలం అన్నారం తండాలో దసరా పండుగ సందర్భంగా వండిన మేక మాంసం తిని 8 మంది అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే... అన్నారం తండాకు చెందిన మెగావత్ శంకర్ ఇంటిలో దసరా పండుగ సందర్భంగా నిన్న రాత్రి మేకను కోశారు. ఈ రోజు ఉదయం ఆ మాంసాన్ని వండి బంధువులతో కలిసి తిన్నారు. కొద్దిసేపటికే ఇంటి వారికి, వచ్చిన బంధువులకు లూజ్ మోషన్స్, వామిటింగ్స్ మొదలయ్యాయి.
వెంటనే వారిని పిట్లం హాస్పిటల్ కు తరలించగా, అక్కడి నుంచి 8 మందిని మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుల వివరాలు:
1. మెగావత్ శంకర్ (42), తండ్రి చండీయా నాయక్ - అన్నారం తండా
2. అరుణ (35), భర్త సంతోష్ - ఎల్లారెడ్డి
3. కల్యాణి (30), భర్త రమేష్ - బుర్గుపల్లి
4. చాందీబాయి (50), భర్త లేక్ సింగ్ - కిష్టాపూర్
5. భూమిక (6) - అన్నారం తండా
6. శ్రీహాన్ (4), తండ్రి బాలగణేష్ - అన్నారం తండా
7. సాయి విశాల్ (2)
8. పావని (2)
ప్రస్తుతం బాధితులకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సెలైన్స్ ఎక్కిస్తూ చికిత్స అందిస్తున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా, బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఘటన తెలియగానే ఆర్డీఓ రవీందర్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణాలపై ఆరా తీస్తున్నారు. అన్నారం తండా సర్పంచ్ లేక్సింగ్ కూడా పరామర్శించారు.






Post a Comment