MBT Request to Embassy | అఫ్జల్ ఖాన్ మృతిపై అధికారిక ధృవీకరణ ఇవ్వాలని జైశంకర్ కు లేఖ

రష్యాలో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎంబీటీ నేత అంజద్ ఉల్లా ఖాన్

మహమ్మద్ అఫ్జల్ ఖాన్ మృతిపై అధికారిక ధృవీకరణ ఇవ్వాలని జైశంకర్ కు లేఖ

భారత రాయబార కార్యాలయం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

బాన్సువాడ :  రష్యా - ఉక్రెయిన్ సరిహద్దులో రష్యన్ మిలిటరీలో పనిచేస్తున్నట్లు చెబుతున్న బాన్సువాడకు చెందిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్ మృతి చెందినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) అధికార ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ బాన్సువాడను సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కుటుంబాన్ని పరామర్శించడం ఇది రెండోసారి.

గతంలో రష్యాలో ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు మోసం చేసి రష్యన్ ఆర్మీలో చేర్పించారని ఆరోపిస్తూ తెలంగాణకు చెందిన నలుగురు యువకుల విషయంలో విదేశాంగ శాఖ మంత్రి డా. ఎస్. జైశంకర్ కు అంజద్ ఉల్లా ఖాన్ లేఖ రాశారు. దీనిపై స్పందించిన మాస్కోలోని భారత రాయబార కార్యాలయం, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో సహా సంబంధిత అధికారులతో విషయాన్ని చర్చిస్తున్నట్లు తెలిపింది.

అయితే తాజాగా కుటుంబానికి షాకింగ్ వార్త అందింది. గత వారంలో రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో పోరాడుతూ అఫ్జల్ ఖాన్ మృతి చెందాడని సిర్షు అశోక్ అనే వ్యక్తి నుంచి వాయిస్ మెసేజ్ వచ్చినట్లు కుటుంబం తెలిపింది. అయితే ఈ మృతి వార్తను ఇప్పటివరకు రష్యా అధికారులు గానీ, భారత ప్రభుత్వం గానీ అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ నేపథ్యంలో అంజద్ ఉల్లా ఖాన్ మరోసారి జైశంకర్ కు లేఖ రాసి, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా అఫ్జల్ ఖాన్ ఆచూకీ, స్థితిపై అధికారిక నిర్ధారణ తీసుకోవాలని కోరారు. ఒకవేళ మృతి నిర్ధారణ అయితే మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ఇతర తెలంగాణ యువకుల భద్రత, విడుదల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

"నేను బాన్సువాడలో అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని రెండోసారి కలిశాను. కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. కొడుకు గురించి నిజం తెలుసుకోవాలని తపిస్తోంది. మృతి వార్త ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు కాబట్టి జైశంకర్, మాస్కో ఎంబసీ వెంటనే వాస్తవాలను ధృవీకరించి కుటుంబానికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. మృతి నిర్ధారణ అయితే మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి" అని అంజద్ ఉల్లా ఖాన్ అన్నారు.

Advertisement 


Post a Comment

Previous Post Next Post