Murder Case | కామారెడ్డిలో పనిమనిషి దారుణం

కామారెడ్డిలో పనిమనిషి దారుణం - పూజ చేస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి హత్య, 8 తులాల బంగారం దోపిడీ

భర్త సాయంతో పక్కా పథకం - కరెంట్ ఆపి, తువ్వాలుతో హత్య, మళ్లీ పనికి వచ్చినట్లు నాటకం

పనిమనిషి ముసుగులో సీరియల్ దొంగ - 2023లోనూ చోరీ, భార్యాభర్తలు అరెస్ట్ - ఎస్పీ అభినందన

కామారెడ్డి, అక్టోబర్ 12:

కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసును కామారెడ్డి పట్టణ పోలీసులు ఛేదించారు. ముష్రీబ్ బాగ్ కు చెందిన చిట్మల్ అనసూయ (66) హత్య కేసులో పనిమనిషి భార్యాభర్తలను అరెస్ట్ చేసి 8 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

అసలేం జరిగింది?

సెప్టెంబర్ 29, 2026 సాయంత్రం 6 నుంచి 7.30 గంటల మధ్య అనసూయను హత్య చేసి ఆమె ధరించిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. భర్త బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అనసూయ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉంది. మెడపై గాయాలు, ఒంటిపై బంగారు పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో హత్య, దోపిడీ కేసు నమోదైంది.

జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాలతో, డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో పట్టణ ఇన్స్పెక్టర్ బి. నరహరి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సంఘటన స్థలంలో ఆధారాలు, సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేయగా ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న రజితపై అనుమానం వచ్చింది.గంజ్ పాఠశాల సమీపంలో రజిత, ఆమె భర్త నర్సింగ్ లను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు.

పక్కా పథకంతో హత్య:

పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దురాలోచనతో అనసూయ ఇంట్లో బంగారం దోచుకోవాలని ప్లాన్ వేశారు. తమను గుర్తుపట్టే అవకాశం ఉండటంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

పథకం ప్రకారం భర్త బయటకు వెళ్లిన సమయంలో అనసూయ పూజ చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఆమెను కింద పడేసి మరో గదిలోకి ఈడ్చుకెళ్లి తువ్వాలుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి ఆభరణాలు దోచుకొని వెళ్లిపోయారు. అనుమానం రాకుండా రజిత యథావిధిగా పనులకు వెళ్లి వస్తున్నట్లు నటించింది.

గతంలోనూ చోరీ:

రజిత గతంలో 2023 సెప్టెంబర్ లో కామారెడ్డిలోని భూమయ్య ఇంట్లో పనిమనిషిగా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో 4 తులాల పుస్తెల తాడు, 5 గ్రాముల చెవి కమ్మలు దొంగిలించినట్లు విచారణలో బయటపడింది.

నిందితులు:

1. బోసు రజిత (40) భర్త నర్సింగ్ - బతుకమ్మ కుంట, కామారెడ్డి

2. బోసు నర్సింగ్ (48) తండ్రి యాదయ్య - బతుకమ్మ కుంట

స్వాధీనం:సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు (పుస్తెల తాడు, 2 ఉంగరాలు, చెవి ఆభరణాలు), సెల్ ఫోన్.

నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బి. నరహరి, ఏఎస్ఐ రంగారావు, కానిస్టేబుళ్లు రామస్వామి, రాజు నాయక్, సంపత్ లను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.



Post a Comment

Previous Post Next Post