PD Act | పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల గంజాయి అక్రమ రవాణా - ముగ్గురిపై PD యాక్ట్

 

పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల గంజాయి అక్రమ రవాణా - ముగ్గురిపై PD యాక్ట్

కామారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కుపాదం - ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిపై PD యాక్ట్ అమలు

కామారెడ్డి, అక్టోబర్ 3: యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను ఉపేక్షించేది లేదని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర హెచ్చరించారు. రూ. 1.93 కోట్ల విలువైన 387 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో మరో ముగ్గురు నిందితులపై PD యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే నలుగురిపై PD యాక్ట్ అమలు చేయగా, తాజాగా మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవడంతో మొత్తం ఏడుగురిపై PD యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

కేసు వివరాలు:

2026 జూన్ 20న ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారి-44పై ప్రత్యేక బృందాలు వాహనాల తనిఖీలు చేపట్టాయి.

ఈ క్రమంలో క్యాసంపల్లి గ్రామ శివారులోని రాయల్ ధాబా సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, వాహనం పైభాగంలో పనసపండ్లను ఉంచి వాటి కింద సంచుల్లో ఎవరికీ అనుమానం రాకుండా భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు.

వాహనంలో నుంచి మొత్తం 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1,93,56,400.

తాజాగా PD యాక్ట్ అమలు చేసిన ముగ్గురు:

1.  షేక్ కరీముల్లా @ షేక్ కరీం, తండ్రి షేక్ ఖాదర్, వయసు 41, తిర్మన్ పల్లి గ్రామం, ఇందల్వాయి మండలం, నిజామాబాద్ జిల్లా.

2.  గైని సుభాష్, తండ్రి సైలూ, వయసు 35, తిర్మన్ పల్లి గ్రామం, ఇందల్వాయి మండలం, నిజామాబాద్ జిల్లా.

3.  షేక్ రహీం, తండ్రి మెరాముద్దీన్, వయసు 59, తిర్మన్ పల్లి గ్రామం, ఇందల్వాయి మండలం, నిజామాబాద్ జిల్లా.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, కామారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, వాహనాల తనిఖీలు, నాకాబందీలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.

"డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడే వారు ఎంత పెద్ద ముఠాగా ఏర్పడి, ఎంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినా కామారెడ్డి పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు" అని ఎస్పీ హెచ్చరించారు.

గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ప్రజలకు సూచించారు.

Post a Comment

Previous Post Next Post