Police Cycle Rally | స్వయంగా సైకిల్ తొక్కిన ఎస్పీ రాజేష్ చంద్ర

అమరవీరుల త్యాగాలను చాటుతూ కామారెడ్డిలో 4 కి.మీ సైకిల్ ర్యాలీ - స్వయంగా సైకిల్ తొక్కిన ఎస్పీ రాజేష్ చంద్ర

_జి.ఆర్. కాలనీ నుంచి కళాభారతి వరకు సాగిన ర్యాలీ_

_పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలే లక్ష్యమన్న ఎస్పీ_

కామారెడ్డి, అక్టోబర్ 27:పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఉదయం 4 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.

పట్టణంలోని జి.ఆర్. కాలనీ వద్ద జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర,  జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీని పూర్తి చేసి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దేశం, సమాజం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడం, పోలీసుల పట్ల అవగాహన కల్పించడం అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

ర్యాలీ మార్గం: జి.ఆర్. కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ హౌసింగ్ బోర్డు కాలనీ, నిజాంసాగర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, సరస్వతి శిశు మందిర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా కళాభారతి వద్ద ముగిసింది.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఇతర ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post