సకాలంలో స్పందించి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్న మాచారెడ్డి పోలీసులు
డయల్ 112కు ఫోన్ రాగానే రంగంలోకి దిగిన పోలీస్ కంట్రోల్ రూం
వ్యక్తిని కాపాడి కుటుంబానికి అప్పగించిన SI విజయ్, సిబ్బందిని అభినందించిన SP రాజేష్ చంద్ర
కామారెడ్డి, అక్టోబర్ 30:
కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మాచారెడ్డి పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయం గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తి భార్యతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 112కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ తక్షణమే స్పందించి మాచారెడ్డి పోలీస్ స్టేషన్ కు సమాచారం చేరవేసింది. అప్రమత్తమైన మాచారెడ్డి ఎస్ఐ కొండ విజయ్ వెంటనే సదరు వ్యక్తికి ఫోన్ చేసి ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.
ఎస్ఐ ఫోన్ లో మాట్లాడుతుండగానే పోలీసు సిబ్బంది సుధాకర్ రెడ్డి, నరేందర్ లను ఘటనా స్థలానికి పంపించారు. వారు అక్కడికి చేరుకుని వ్యక్తిని సురక్షితంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అనంతరం భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
డయల్ 112 సమాచారంపై కంట్రోల్ రూమ్ సమన్వయం, ఎస్ఐ సమయస్ఫూర్తి, సిబ్బంది వేగవంతమైన స్పందనతో ఒక ప్రాణం నిలబడిందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రశంసించారు. సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఎస్ఐ విజయ్, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని ఎస్పీ అన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఆపదలో ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.

Post a Comment