Theft Case | కామారెడ్డి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా అరెస్ట్ - 19 కేసుల్లో ప్రమేయం

బిచ్కుందలో అంతరాష్ట్ర దొంగ సత్నామ్ సింగ్ పట్టివేత

కామారెడ్డి, అక్టోబర్ 11:

బిచ్కుందలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసులో పోలీసులు మరో అంతరాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేశారు. బావమరిది షంషేర్ సింగ్‌తో కలిసి కామారెడ్డి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడినట్లు తేలింది.

జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాలతో బాన్సువాడ డీఎస్పీ పి.విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బిచ్కుంద సీఐ రవికుమార్, సీసీఎస్ సీఐ సంతోష్ గౌడ్, బిచ్కుంద ఎస్సై రాజు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.

గోపన్‌పల్లి శివారులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి రాగి తీగలు, బుష్ రాడ్లు, ఆయిల్ దొంగిలించిన ఘటనపై ఏఈ సోలేటి పవన్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

దర్యాప్తులో భాగంగా 11.10.2026 మధ్యాహ్నం 1 గంటకు ఫట్లపూర్ శివారులోని రాజస్థాన్ ధాబా సమీపంలో గస్తీలో ఉన్న బిచ్కుంద ఎస్సై సిబ్బంది అనుమానాస్పదంగా హోండా యునికార్న్ (MH 22 BJ 7881)పై వెళ్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడు మహారాష్ట్ర పర్భాని జిల్లా జరి ప్రాంతం భుయ్ గల్లీకి చెందిన సత్నామ్ సింగ్ చందూ సింగ్ బావరి (39)గా తేలింది.

విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు:

- సత్నామ్ సింగ్ తన బావమరిది తక్ షంషేర్ సింగ్‌తో కలిసి జాతీయ రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్ చేశాడు.

- మొత్తం 19 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు.

- షంషేర్ సింగ్‌ను భిక్నూర్ పోలీసులు 10.10.2026న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

చోరీ విధానం

సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి, సైకిల్ ట్యూబ్‌తో రంపపు బ్లేడ్‌ను పొడవాటి కర్రకు కట్టి, విద్యుత్ సరఫరా నిలిపివేసి ట్రాన్స్‌ఫార్మర్లను కిందకు దించి, స్పానర్లు, కట్టర్లతో రాగి కాయిల్స్ చోరీ చేసేవారు.

నిందితుడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, వివో Y39 5G మొబైల్, టార్చ్‌లైట్, స్క్రూడ్రైవర్, కట్టర్, ప్లయర్, సుత్తి, ఇనుప రాడ్, రాగి కాయిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన బిచ్కుంద సీఐ రవికుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సై గుండెల రాజు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, ఐటీ కోర్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ గణపతి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, లక్ష్మీకాంత్, మోహన్‌లను ఎస్పీ అభినందించారు.



Post a Comment

Previous Post Next Post