Police Nigha | దీపావళి ధమాకా.. కామారెడ్డి పోలీసుల పక్కా నిఘా

దీపావళి ధమాకా.. కామారెడ్డి పోలీసుల పక్కా నిఘా

దొంగల బారి నుంచి ఇళ్లకు రక్షణకు జాగ్రత్తలు తప్పనిసరి

అనుమానం వస్తే వెంటనే 112కు డయల్ చేయండి: ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, నవంబర్ 6: దీపావళి పండుగ వేళ జిల్లా వ్యాప్తంగా పోలీసులు పక్కా నిఘా ఏర్పాటు చేశారు. పండుగ సందర్భంగా ప్రజలు ఊళ్లకు వెళ్లే క్రమంలో ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ శాఖ సూచించింది.

ఇంటి భద్రత విషయంలో మొదటగా డోర్ లాకింగ్ సిస్టమ్ పై దృష్టి పెట్టాలని తెలిపారు. నాణ్యమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేదా డిజిటల్ స్మార్ట్ లాక్స్ వేయించుకోవాలని, ఇంటి చుట్టూ స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ అయ్యే సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. ఇంటి ముందు ఎత్తైన ప్రదేశంలో సీసీ కెమెరా కనిపించేలా ఉంటే దొంగలకు హెచ్చరికగా ఉంటుందని పేర్కొన్నారు. కరెంట్ సరఫరా ఆగినా కెమెరాలు పనిచేసేలా ఇన్వర్టర్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఇంట్లో బంగారం, భారీగా నగదు ఉంచకుండా ముందే బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలని, ఊరెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా రహస్యంగా ఉంచాలని కోరారు.

పటాకులు కాల్చేటప్పుడు భద్రతను అస్సలు విస్మరించవద్దని పోలీసులు హెచ్చరించారు. చేతిలో బాంబులు పట్టుకుని కాల్చే రిస్కీ స్టంట్లు చేయవద్దని, పటాకులు కాల్చే ప్రదేశంలో ఒక బకెట్ నీళ్లు, ఇసుక సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు పటాకులు పేల్చాలని, టైట్ కాటన్ దుస్తులు, షూస్ వేసుకోవాలని సూచించారు. పటాకులు కాల్చే సమయంలో తలుపులు తెరిచి ఉంచితే ఎవరైనా ఇంట్లోకి దూరే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ఎక్కువ రోజులు ఊరెళ్తుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఏ చిన్న అనుమానం వచ్చినా లేదా అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే 112 నంబర్ కు డయల్ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ సురక్షితమైన, సంతోషకరమైన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రమాదాలకు తావులేకుండా సురక్షితంగా జరుపుకోవాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post