Record in Mobiles Recovery | మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు

మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు - రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం

CEIR పోర్టల్ ద్వారా ₹9 కోట్ల విలువైన 5678 ఫోన్లు గుర్తింపు - బాధితులకు అప్పగింత

ప్రతినెలా 150కి పైగా ఫోన్ల రికవరీ - గత 45 రోజుల్లో ₹42 లక్షల విలువైన 264 ఫోన్లు స్వాధీనం - ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, నవంబర్ 2:మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. కమిషనరేట్లు మినహా జిల్లాల వారీగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ బాధితుల బాధ్యతను తమ బాధ్యతగా స్వీకరించి ఈ ఘనత సాధించామన్నారు. మొబైల్ ఫోన్ పోవడం అనేది కేవలం పరికరం పోవడం కాదని, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత డేటా భద్రతకు ముప్పు అని అన్నారు.

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో, ఆర్‌ఎస్‌ఐ బాలరాజు,  ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందం ప్రతి నెల సగటున 150కి పైగా ఫోన్లను రికవరీ చేస్తోంది.

ఈ ఏడాది ఇప్పటివరకు ₹2.23 కోట్ల విలువైన 1397 ఫోన్లు, గత 45 రోజుల్లోనే ₹42.24 లక్షల విలువైన 264 ఫోన్లు రికవరీ చేశామన్నారు. గత ఏడాది ₹3 కోట్ల విలువైన 1834 ఫోన్లను బాధితులకు అందజేశామని గుర్తుచేశారు.

CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ₹9.08 కోట్ల విలువైన 5678 ఫోన్లను ట్రాక్ చేసి బాధితులకు అప్పగించామన్నారు. ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, సిమ్‌ను బ్లాక్ చేసి CEIR పోర్టల్‌లో IMEI నంబర్‌ను బ్లాక్ చేయాలని సూచించారు.

రికవరీ అయిన ఫోన్ల కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఐ బాలరాజు (8712686114)ను సంప్రదించాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post