#101 గ్రాముల స్వాధీనం
#ఇద్దరు నిందితులు అరెస్ట్
#వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజా రెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్, ఎల్లారెడ్డి:
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థమైన ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా మరియు విక్రయానికి యత్నిస్తున్న వ్యక్తులపై పోలీసులు వేగంగా స్పందించి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 101 గ్రాముల ఆల్ప్రాజోలామ్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు పులి రమేష్, తన వద్ద ఉన్న ఆల్ప్రాజోలామ్‌ను విక్రయించడానికి తన స్నేహితుడైన ఒలేపు రమేష్ మరియు మధ్యవర్తి హసన్‌పల్లి అనిల్ కుమార్‌తో కలిసి పథకం రచించాడు. ఈ నిషేధిత పదార్థాన్ని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెపర్తి ఈశ్వర్ గౌడ్‌కు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్ కుదుర్చుకున్నందుకు గాను అనిల్ కుమార్‌కు ఐదు వేల రూపాయల పారితోషికం ఇస్తానని ఆశ చూపిన పులి రమేష్, ముందుగా రెండు వేల రూపాయల నగదును కూడా అందజేశాడు.
అరెస్ట్ జరిగిన తీరును పరిశీలిస్తే.. ఈ నెల 11వ తేదీ సాయంత్రం పులి రమేష్ సూచనల మేరకు అనిల్ కుమార్ తన బజాజ్ CT-100 మోటార్ సైకిల్‌పై గండిమాసానిపేట్‌లోని ఒలేపు రమేష్ నివాసానికి చేరుకున్నాడు. అక్కడ ఎలక్ట్రానిక్ యంత్రంతో తూకం వేసి సిద్ధంగా ఉంచిన 101 గ్రాముల ఆల్ప్రాజోలామ్ ప్యాకెట్‌ను తీసుకున్నాడు. ఈ పదార్థాన్ని కొనుగోలుదారుడికి నమూనా (Sample) చూపించేందుకు గండిమాసానిపేట్ గ్రామ గేటు వద్దకు వెళ్తుండగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి పోలీసులు మాటు వేసి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనిల్ కుమార్ ఇచ్చిన సమాచారంతో ఒలేపు రమేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పులి రమేష్ పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిందితుల వివరాలు:
1.పులి రమేష్ (A-1) — కొత్తపల్లి గ్రామం. 2. హసన్‌పల్లి అనిల్ కుమార్ (A-2) — కొత్తపల్లి గ్రామం, ఎల్లారెడ్డి మండలం.3. ఒలేపు రమేష్ (A-3) — గండిమాసానిపేట్ గ్రామం, ఎల్లారెడ్డి మండలం.
ఈ కేసును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి DSP S. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, CI శ D. రాజారెడ్డి, సిసియస్ ఇన్స్పెక్టర్ రామన్, SI B. మహేష్ CCS & స్థానిక పోలీస్ సిబ్బంది సంయుక్తంగా చాకచక్యంగా దర్యాప్తు చేసి 24 గంటల్లో ఛేదించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Post a Comment