Suicide Attemept | మృత్యువు ఒడి నుంచి కాపాడిన ఖాకీలు !

 

#వ్యక్తికి పునర్జన్మనిచ్చిన 'ఖాకీ' హీరోలు!

​#డయల్ 100 కాల్‌కు మెరుపువేగంతో స్పందన

#ఉరితాడు నుండి ప్రాణాన్ని లాక్కొచ్చిన పోలీసులు

#​సమయస్ఫూర్తితో ప్రాణాలు రక్షించిన సిబ్బందిని అభినందించిన  ఎస్పీ (vedio👇👇)

తెలంగాణ డైలీ న్యూస్, ​బాన్సువాడ:

ఆస్తి పంపకాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి చేసుకొని ఆత్మ హత్యా యత్నానికి పాల్పడుతూ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి, చివరి క్షణంలో ఉరి నుంచి సదరు వ్యక్తి ని కాపాడారు. 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సోమవారం నాడు ఈ ఉత్కంఠభరితమైన సంఘటన చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని మనస్తాపం చెందిన గూడెం గల్లికి చెందిన రంగరి వెంకటి (55), ఆత్మహత్యే శరణ్యమని భావించి ఉరి వేసుకునే ముందు డయల్ 100కు సమాచారం అందించారు. క్షణాల్లో స్పందించిన పోలీసులు మృత్యువుతో పోరాడుతున్న ఒక నిండు ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.

​సమాచారం అందిన వెంటనే బ్లూ కోల్ట్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. స్థానికుల సహాయంతో ఖచ్చితమైన చిరునామాను సేకరించిన పోలీసులు, లోపల గడియ పెట్టుకున్న తలుపులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పగలగొట్టారు. అప్పటికే వెంకటి ఉరి వేసుకొని కొన ఊపిరితో వేలాడుతుండటం గమనించి, తక్షణమే అతడిని కిందికి దించి ప్రాథమిక చికిత్స అందిస్తూ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్య సాయం అందడంతో బాధితుడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.

​విధి నిర్వహణలో అత్యంత సాహసాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించి ప్రాణాలను కాపాడిన పోలీసు కానిస్టేబుల్ డి. నవీన్, హోంగార్డ్ రాములులను జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర  ప్రత్యేకంగా అభినందించారు. ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100ను ఆశ్రయించడం, పోలీసులు ఇంత వేగంగా స్పందించడం ప్రజల్లో పోలీసు శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసింది. పోలీసులు స్పందించిన తీరుపై ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post