Collector | ఘనంగా మహర్షి భగీరథ జయంతి

 [ఫోటో: కామారెడ్డి కలెక్టరేట్‌లో మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్]

కామారెడ్డి కలెక్టరేట్‌లో వేడుకలు

 –భగీరథుని కృషి స్ఫూర్తిదాయకమన్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

తెలంగాణ డైలీ న్యూస్,  కామారెడ్డి: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం మహర్షి భగీరథ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి భగీరథుడు తన పట్టుదల, అకుంఠిత దీక్షతో గంగానదిని భువికి తెచ్చి లోక కల్యాణం చేశారని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆయన కృషి నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

భగీరథుని వలె మనమందరం సమాజ హితం కోసం నిస్వార్థంగా పనిచేయాలని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది భగీరథుని ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జల సంరక్షణ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ విషయాల్లో భగీరథుని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సగర పుత్రులకు ముక్తిని కలిగించడం కోసం తరతరాలుగా చేసిన తపస్సును కొనసాగించి విజయం సాధించిన భగీరథుని సంకల్పం అందరికీ ఆదర్శమని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఏసీఎల్‌బీ మధు మోహన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జయరాజ్, సహాయ అధికారి చక్రధర్, పవన్, సునీత, అశ్వక్, జీవన్, శాంతయ్య తదితరులు, జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post