Minister Seethakka | తాగునీరు, సాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, వడదెబ్బల నివారణపై ప్రత్యేక దృష్టి

•కామారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి సీతక్క అధ్యక్షతన సమీక్ష 

•తాగునీరు, సాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, వడదెబ్బల నివారణపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో పాటు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమీక్షించిన అంశాలు: 

జిల్లాలో తాగునీటి సరఫరా, సాగునీటి పరిస్థితి, సివిల్ సప్లై, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, ఎండాకాలంలో వడదెబ్బల నివారణ చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న 99 సంక్షేమ-అభివృద్ధి పథకాలపై సమగ్రంగా సమీక్షించారు.




మంత్రి సీతక్క ఆదేశాలు:

కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. ప్రతి గ్రామానికి తాగునీరు నిరంతరంగా అందేలా, సాగునీటి అవసరాలు సమయానికి తీరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా పనులు వేగవంతం చేసి అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా సమన్వయంతో పనిచేయాలన్నారు.

షబ్బీర్ అలీ వ్యాఖ్యలు: 

కామారెడ్డి జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. సివిల్ సప్లైలో లోపాలు లేకుండా పేదలకు నాణ్యమైన సరుకులు అందించాలని, తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. వడదెబ్బలపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర పథకాల సమన్వయంతో జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేస్తే రైతులకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని, ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.





Post a Comment

Previous Post Next Post