ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్/కామారెడ్డి:
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్చాలని, అనర్హుల పేర్లను తొలగించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం త్వరలో రాష్ట్రంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో అదనపు సీఈఓ డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ఎస్ఐఆర్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
సీఈఓ మాట్లాడుతూ డీఈఓ, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓ సూపర్ వైజర్లు, బీఎల్ఓల బాధ్యతలు, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఐటీ కార్యకలాపాలపై వివరించారు. రాష్ట్ర నోడల్ అధికారి ఎస్ఐఆర్ చట్టపరమైన నిబంధనలు, అమలు దశలు, విధానాలపై సూచనలు చేశారు.
ప్రాజెక్ట్ మేనేజర్ ఈసీఐఎన్ఈటీ మాడ్యూల్స్, ఎస్ఐఆర్ దశలు, ప్రీ డ్రాఫ్ట్, పోస్ట్ డ్రాఫ్ట్, బీఎల్ఓ యాప్, సాంకేతిక అంశాలు, ఎన్యూమరేషన్ ఫారం నింపే విధానాన్ని వివరించారు. అధికారుల సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్లు పాల్గొన్నారు. డిప్యూటీ సీఈఓ, సీఈఓ కార్యాలయ నోడల్ అధికారులు, సిబ్బంది కూడా హాజరయ్యారు.
ఫారాల వినియోగంపై అవగాహనఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఫారం 6, ఫారం 7, ఫారం 8 వినియోగంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. సీఈఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించారు.
ఫారం 6 ద్వారా కొత్త ఓటరు నమోదు, ఫారం 7 ద్వారా అర్హత లేని లేదా మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, ఫారం 8 ద్వారా ఓటర్ల వివరాలలో మార్పులు, సవరణలు చేసే విధానాన్ని వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఫారాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.


Post a Comment