గడువు 2028 ఆగస్టు 31 వరకు పొడిగింపు
తెలంగాణలో 27 వేల మంది ఇంకా అర్హత సాధించాలి
(తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, హైదరాబాద్)
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై, ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.
2025 సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పులో టెట్ పాస్ అయ్యేందుకు రెండేళ్ల గడువు ఇచ్చింది. దీనిపై 69 ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని కొట్టేస్తూ, గతంలో 2027 ఆగస్టు 31 వరకు ఉన్న గడువును 2028 ఆగస్టు 31 వరకు మరో ఏడాది పొడిగించింది. అంటే ఇన్-సర్వీస్ టీచర్లు 2028 ఆగస్టు 31లోగా టెట్ అర్హత సాధించాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి టెట్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని, రెండు పరీక్షల మధ్య ఆరు నెలల వ్యవధి ఉండాలని కోర్టు ఆదేశించింది. విద్యా హక్కు చట్టం వచ్చి 15 ఏళ్లయినా టీచర్లకు టెట్ పాస్ కావడానికి సమయం లేదనడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
NCTE నోటిఫికేషన్ 23.08.2010 కంటే ముందు నియమితులైన ప్రభుత్వ, స్థానిక సంస్థల టీచర్లకు మాత్రమే టెట్ నుండి మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ అన్-ఎయిడెడ్, నాన్-అప్రూవ్డ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు తప్పనిసరిగా టెట్ రాయాలి.
తెలంగాణలో పరిస్థితి
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1.02 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 57,000 మంది టెట్ అర్హత లేకుండానే ఉద్యోగాల్లో చేరారు. జూన్ 2024 నుండి జనవరి 2026 మధ్య జరిగిన టెట్‌లలో సుమారు 30,000 మంది ఇన్-సర్వీస్ టీచర్లు అర్హత సాధించారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం సుమారు 27,000 మంది టీచర్లు ఇంకా టెట్ పాస్ కావాల్సి ఉంది. 2026 జనవరిలో జరిగిన టీజీ టెట్‌కు 65,605 మంది ప్రభుత్వ టీచర్లు హాజరయ్యారు. వీరిలో 37,803 మంది పాసయ్యారు, 27,712 మంది ఫెయిలయ్యారు. ఇన్-సర్వీస్ టీచర్ల ఉత్తీర్ణత 57.76 శాతంగా నమోదైంది.
27,000 మంది టీచర్లు ఇంకా అర్హత సాధించాల్సి ఉండటంతో, పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది రెండు ప్రత్యేక టెట్‌లు నిర్వహించాలని ప్రతిపాదించింది.
టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం పోతుందని, పదోన్నతులు రావని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. దీంతో సర్వీస్‌లో ఉన్న టీచర్లు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది సెలవులు పెట్టి కోచింగ్‌లకు వెళ్తున్నారు. కొందరు తాము పాఠాలు చెప్పిన విద్యార్థుల సహాయం తీసుకుంటున్నారు.


Post a Comment