Top News

Collector | జూన్ 7లోగా మొక్కజొన్న సేకరణ పూర్తి చేయాలి - కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

జూన్ 7లోగా మొక్కజొన్న సేకరణ పూర్తి చేయాలి - కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

పద్మాజీవాడి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్  

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం తరలింపునకు ఆదేశం  

తెలంగాణ డైలీ న్యూస్, సదాశివనగర్: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జూన్ 7వ తేదీలోగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.  

పద్మాజీవాడి కేంద్రం సందర్శన  

బుధవారం ఆయన సదాశివనగర్ మండలం పద్మాజీవాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు, రవాణా ప్రక్రియల పురోగతిని పరిశీలించారు. ఇప్పటివరకు 18,840 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేయగా, 15,000 క్వింటాళ్లను గోదాములకు తరలించామని, ప్రస్తుతం 3,840 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని అధికారులు వివరించారు. కేంద్రంలో ఇంకా 16 కుప్పలు ఉండగా, దాదాపు 3,000 సంచుల ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.  

రైతులతో ముఖాముఖి  

కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా గోదాములకు తరలించాలని, కేంద్రాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని డీఎం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మద్దతు ధర ప్రయోజనాలు పూర్తిగా అందేలా చూడాలన్నారు.  




మోడేగాంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన  

గుడిసెలు లేని జిల్లాగా కామారెడ్డి - కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

అనంతరం సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.  

బాధితురాలితో మాటామంతి  

గత ఏడాది భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన లబ్ధిదారురాలు పిల్లి సాయవ్వతో కలెక్టర్ మాట్లాడారు. పూరి గుడిసెలో నివసిస్తూ ఇల్లు కోల్పోయానని, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ద్వారా సురక్షిత నివాసం కలగబోతుందని సాయవ్వ ఆనందం వ్యక్తం చేశారు.  

రెండో విడతలో పూరి గుడిసెల వారికి ప్రాధాన్యం  

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లలో పూరి గుడిసెల్లో ఉన్నవారిని గుర్తించి మంజూరు చేయాలని, జిల్లాలో ఎక్కడా పూరి గుడిసెలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు.  

స్వయం సహాయక సంఘాలకు రూ.1.59 కోట్ల రుణాలు  

గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 90 మంది లబ్ధిదారులకు రూ.1.59 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పెంపొందించుకోవాలని సూచించారు.  

ఈ కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్, డీసీఓ, డీఎం మార్క్‌ఫెడ్, డీసీఎస్‌ఓ, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఏఓ, పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

============


విద్యాశాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఎడ్యుకేషనల్  సెక్రెటరీ, అభినవ్ అభిలాష విద్యా శాఖ సెక్రటరీ యోగితారాణా , డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలిన్,  హయ్యర్ ఎడ్యుకేషన్ దేవసేన అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

విద్యాశాఖ కార్యదర్శి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO)లతో  కలసి పాల్గొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” ప్రవేశాల ప్రత్యేక కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs), మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

అలాగే జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. భవిత కేంద్రాల బలోపేతం, కొత్త ప్రీ-ప్రైమరీ విభాగాల ప్రారంభం, జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలల పునఃప్రారంభం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, AXL, AI-Pi-Jam వంటి వేదికల వినియోగాన్ని పెంచాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ సకాలంలో పంపిణీ చేయడంతో పాటు, సెర్ప్ బృందాల ద్వారా యూనిఫార్ముల కుట్టింపు ,పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో విద్యా కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణతో పాటు రోజువారీ పురోగతి సమీక్ష నిర్వహించాలని సమావేశంలో సూచించారు.



Post a Comment

Previous Post Next Post