Top News

Collector's Cycling | హరిత భవిష్యత్తు కోసం సైక్లింగ్: కామారెడ్డిలో ఫిట్ ఇండియా ర్యాలీ

హరిత భవిష్యత్తు కోసం సైక్లింగ్: కామారెడ్డిలో ఫిట్ ఇండియా ర్యాలీ  

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ తోడ్పడుతుంది: కలెక్టర్  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కామారెడ్డి పట్టణంలో “హరిత భవిష్యత్తు కోసం సైక్లింగ్” అనే ఇతివృత్తంతో ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ సైక్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  (Video 👇)


ఆరోగ్యకర జీవనశైలి, కాలుష్య నియంత్రణే లక్ష్యం  

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే సైక్లింగ్‌ను ప్రజల్లో ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజంతో పాటు పచ్చని పర్యావరణాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని సూచించారు.  దేశవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  

యువత, అధికారుల ఉత్సాహభరిత భాగస్వామ్యం  

యువత, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు, వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఈ సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్‌వీ గిరి, డీవైఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, క్రీడా సంఘాల సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post