Top News

Congress Press Meet | అసత్య ప్రచారాలకు కాంగ్రెస్ ఘాటు కౌంటర్

 

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం 

అసత్య ప్రచారాలకు కాంగ్రెస్ ఘాటు కౌంటర్  

_ఎమ్మెల్యేలు మదన్‌మోహన్ రావు, తోట లక్ష్మీకాంతరావు  

_పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యేల రూ.4.80 లక్షల సహకారం_  

_కామారెడ్డిలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్_  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 23: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.  

అసత్య ప్రచారాలను ఖండించిన ఎమ్మెల్యేలు  

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. రైతులకు ఎరువుల సరఫరా, యూరియా అందుబాటుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వాస్తవాలతోనే తిప్పికొడుతామని పేర్కొన్నారు.  

కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం 

140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి జిల్లా కేంద్రంలో సొంత కార్యాలయం లేకపోవడం బాధాకరమని, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చొరవతో ఇప్పుడు సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్యేలు కొనియాడారు.  

కార్యాలయ నిర్మాణ ఖర్చు మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీనే భరిస్తుందని, ఎలాంటి చందాలు లేదా కార్యకర్తలపై ఆర్థిక భారం ఉండదని వెల్లడించారు.  

ఎమ్మెల్యేల ఆర్థిక సహకారం  

స్థల కొనుగోలుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిసి రూ.4 లక్షల 80 వేల ఆర్థిక సహకారం అందించారు. పార్టీ పట్ల వారి అంకితభావానికి ఇది నిదర్శనమని సమావేశంలో ప్రస్తావించారు.  

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి ఈ కార్యాలయం కేంద్ర బిందువుగా మారుతుందని, కార్యకర్తలకు స్ఫూర్తిదాయక వేదికగా నిలుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.




Post a Comment

Previous Post Next Post