గాంధారి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కురపాటి రఘు హఠాన్మరణం
విధులకు వెళ్తుండగా గుండెపోటు.. బాన్సువాడలో విషాదం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 9: గాంధారి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కురపాటి రఘు(44) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
సోమవారం రాత్రి విధులు నిర్వహించిన రఘు, మంగళవారం ఉదయం విధుల కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వాంతులు చేసుకొని కుప్పకూలిపోయారని బంధువులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. రఘు స్వగృహం బాన్సువాడలోని సిద్ధి గల్లి, వార్డు నంబర్ 16లో ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పోలీస్ శాఖలో విషాదం
రఘు ఆకస్మిక మరణం స్థానిక పోలీస్ శాఖలో, బాన్సువాడ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన ఆయన మరణం పట్ల సహోద్యోగులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన భౌతికకాయాన్ని బాన్సువాడకు తరలించారు. గాంధారి ఎస్సై, సీఐ, పోలీస్ సిబ్బంది నివాళులర్పించారు. కామారెడ్డి అడిషనల్ ఎస్పీ కూడా విచ్చేస్తున్నట్లు సమాచారం. అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నారు.
"ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రఘు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం" అని తోటి సిబ్బంది పేర్కొన్నారు.

Post a Comment