పూరిగుడిసెలు లేని జిల్లాగా కామారెడ్డిని తీర్చిదిద్దాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వేగవంతం చేయాలి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 9: జిల్లాలో ఒక్క పూరిగుడిసె కూడా లేకుండా పూరిగుడిసెలు లేని జిల్లాగా కామారెడ్డిని తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.
మంగళవారం రామారెడ్డి మండలంలోని వడ్డెర కాలనీని సందర్శించిన కలెక్టర్, పూరిగుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కీలక ఆదేశాలు:
- రెండో విడత: రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూరిగుడిసెలో ఉన్నవారిని గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేయాలి.
- రుణ సౌకర్యం: పేమెంట్ సమస్యలు తలెత్తితే APM ద్వారా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి.
- సమగ్ర సర్వే: నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో పొరపాట్లు జరగకుండా గ్రామస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలి.
- సాంకేతిక సహకారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహకారం అందించాలి.
అర్హత కలిగిన ప్రతి కుటుంబం ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనం పొందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, ఎమ్మార్వో, సర్పంచ్ బండి ప్రవీణ్, ఎంపీడీవో నాగేశ్వర్ రావ్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
భద్రతా ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణకు ఆదేశం
కామారెడ్డి, జూన్ 10: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహించే త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాం తాళాల భద్రత, సీసీటీవీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా సిబ్బంది విధులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు.
గోదాంలో భద్రపరిచిన యంత్రాల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, గోదాం ఇన్‌ఛార్జ్‌లు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
జిల్లాలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, ప్రతి చిన్నారికి విద్యను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
మంగళవారం రామారెడ్డి మండలంలోని SC కాలనీ లో నిర్వహించిన బడి బాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి, ఇంటింటి ప్రచారం (Door-to-Door Campaign) ద్వారా పాఠశాల వయస్సు కలిగిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన చిన్నారులకు ప్రీ-ప్రైమరీ తరగతుల్లో, అలాగే ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అడ్మిషన్లు నమోదు చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులను కూడా గుర్తించి నమోదు చేపట్టడం జరిగిందని అన్నారు.
అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.
పాఠశాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే డ్రాప్‌అవుట్ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
విద్యే సమాజాభివృద్ధికి పునాదిగానిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, త్వరలో ప్రారంభం కానున్న అల్పాహార పథకం, డిజిటల్ విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




Post a Comment