కాంగ్రెస్‌లో చేరికలకు క్రమబద్ధమైన విధానం తప్పనిసరి
అనధికారిక చేరికలకు గుర్తింపు లేదు: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
టీపీసీసీ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశం
తెలంగాణ డైలీ న్యూస్/కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో చేరికల ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించాలని, అనధికారికంగా జరిగే చేరికలకు పార్టీలో ఎలాంటి గుర్తింపు ఉండదని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్పష్టం చేశారు.
ఈ మేరకు మండల, టౌన్ అధ్యక్షులకు ఆయన సూచనలు జారీ చేశారు. జిల్లాలోని ఏ మండలం లేదా టౌన్ పరిధిలోనైనా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు లేదా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే ముందుగా సంబంధిత మండల అధ్యక్షుడు లేదా టౌన్ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుల సమక్షంలో గానీ, ఎమ్మెల్యేల సమక్షంలో గానీ, లేదా నియోజకవర్గ ఇన్‌చార్జిల సమక్షంలో గానీ అధికారికంగా చేరికలు నిర్వహించాలని సూచించారు.
పార్టీ నియమ నిబంధనలను పక్కనపెట్టి వ్యక్తిగతంగా లేదా అనధికారికంగా ఎవరైనా చేరికలు నిర్వహించినట్లయితే, అలాంటి చేరికలకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండదని, ఆ చేరికలు చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ క్రమశిక్షణ, సంస్థాగత వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. చేరికల విషయంలో పార్టీ నిర్ణయించిన విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఏలే మల్లికార్జున్ తెలిపారు. జిల్లాలోని మండల, టౌన్ అధ్యక్షులు ఈ సూచనలను కచ్చితంగా అమలు చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీ అధికారిక వేదికల ద్వారానే జరగాలని, క్రమశిక్షణకు విరుద్ధంగా జరిగే చేరికలకు గుర్తింపు ఉండదని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పునరుద్ఘాటించారు.

Post a Comment