HARISH RAO | రాహుల్ పుట్టినరోజునే 'రైతు డిక్లరేషన్'కు రేవంత్ సర్కార్ సమాధి: హరీశ్ రావు

 


రాహుల్ పుట్టినరోజునే 'రైతు డిక్లరేషన్'కు రేవంత్ సర్కార్ సమాధి: హరీశ్ రావు

బోనస్ లేదు, కొనుగోళ్లు లేవు.. కేంద్రం చెబితేనే కొంటామన్న దద్దమ్మ ప్రభుత్వం: మాజీ మంత్రి ధ్వజం  

5 సీజన్లలో రూ.29,358 కోట్ల రైతు భరోసా ఎగవేత.. రైతు బీమా బంద్: హరీశ్

(దాస శ్రీనివాస్-తెలంగాణ డైలీ న్యూస్) సిద్ధిపేట, జూన్ 19: రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే కాంగ్రెస్ 'రైతు డిక్లరేషన్‌'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ బొంద పెట్టిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి టి. హరీశ్ రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్ధిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌లో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు బోనస్ లేదని, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కూడా కొనదని తేల్చి చెప్పడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని ఆయన విమర్శించారు.

"ఫెయిత్‌లెస్ కేబినెట్"

గురువారం కేబినెట్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఏ పంట కొనమంటే అది, ఎంత కొనమంటే అంతే కొంటామని చెప్పారని, ఇది పేపర్ల కేబినెట్ కాదు.. రైతుల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని 'ఫెయిత్‌లెస్' కేబినెట్ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. 

బోనస్‌లో కోత

ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ అని, తర్వాత వరికి మాత్రమే అని, ఆ తర్వాత సన్నాలకు మాత్రమే అని, 33 రకాల సన్నాలకు అని చెప్పి ఇప్పుడు కేవలం 7 రకాలకే కుదించడం బోనస్ ఎగ్గొట్టేందుకు కుట్ర అని ఆరోపించారు. బీపీటీ 520 లాంటి రకాలకు దిగుబడి తక్కువ, చీడపీడలు ఎక్కువని, రూ.500 బోనస్ కంటే రైతుకే నష్టమని చెప్పారు. గత యాసంగికి రూ.1200 కోట్లు, ఈ వానాకాలం రూ.700 కోట్ల బోనస్ ఎగ్గొట్టారని అన్నారు.


రైతు భరోసా, రైతు బీమా బకాయిలు  

నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి 45 రోజుల్లో రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పి 91 రోజులైనా రూ.9 వేల కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 సీజన్లలో రైతు భరోసా కింద రూ.29,358 కోట్లు బాకీ పడ్డారని తెలిపారు. 

జనవరి నుంచి 5 నెలలుగా రైతు బీమా బంద్ అయిందని, చనిపోయిన 7,600 మంది రైతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదని ఆరోపించారు. ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడమే కారణమని చెప్పారు.

యూరియాపై ఆంక్షలు 

యాప్‌ల పేరుతో ఎకరాకు రెండే యూరియా బస్తాలని ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసు బందోబస్తు మధ్య పోలీస్ స్టేషన్లలో యూరియా పంచడం దారుణమని అన్నారు. మిర్చికి 5-6 బస్తాలు, వరికి 3 బస్తాలు అవసరమైతే రెండు బస్తాలే ఇస్తే రైతు ఏం చేయాలని ప్రశ్నించారు.

కొనుగోళ్లపై వెనక్కి తగ్గింపు

కేంద్రం జొన్నలు, మక్కలు కొనదని, క రాష్ట్ర ప్రభుత్వం కూడా వానాకాలం నుంచి కొనమని చేతులెత్తేసిందని అన్నారు. కందులు, పెసలు, శనగలు, సన్‌ఫ్లవర్‌ను కేంద్రం 25% మాత్రమే కొంటుందని, మిగతా పంటను రైతు బయట మార్కెట్లో అమ్ముకోవాలా అని నిలదీశారు. 

కేసీఆర్ హయాంలో 2021-22లో కేంద్రం కొనకపోయినా 92 లక్షల టన్నుల వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటుందని, రేవంత్ సర్కార్ కూడా అంతే కొని వదిలేస్తుందా అని ప్రశ్నించారు.

"కొనుగోళ్లు ఖతం, రైతు భరోసా ఖతం, రైతు బీమా ఖతం, యూరియా ఖతం.. రేవంత్ పాలనలో రైతులకు మిగిలింది గోచి తప్ప ఏమీ లేదు" అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కేబినెట్‌లో తీసుకున్న కర్కశ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Post a Comment

أحدث أقدم