బాసర అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలి: మంత్రి జూపల్లి
మహంకాళి ఆలయ చోరీ ఘటనపై అధికారులను ఆరా
బాసర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
నిర్మల్, తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి :
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల్లో టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. (వీడియో 👇)
ఆదివారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఇటీవల చోరీ జరిగిన మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఇంద్రప్రస్థ గెస్ట్ హౌస్‌లో బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి, ఆలయ ఈవో అంజనాదేవితో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment