ఆదిలాబాద్‌లో రూ.40 కోట్లతో మైనార్టీ గురుకులం, జూనియర్ కళాశాల ప్రారంభం
మైనార్టీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: షబ్బీర్ అలీ
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రుల ఆకాంక్ష
ఆదిలాబాద్, తెలంగాణ డైలీ న్యూస్:
ఆదిలాబాద్ పట్టణంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.20 కోట్లతో నిర్మించిన మైనార్టీ గురుకుల బాలుర-2 విద్యాలయం, మరో రూ.20 కోట్లతో నిర్మించిన జూనియర్ కళాశాల రెసిడెన్షియల్ స్కూల్‌ను శనివారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహమ్మద్ అజారుద్దీన్, TGMREIS అధ్యక్షులు ఫహీమ్ ఖురేషి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీ ఉల్లా ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, పాయల్ శంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో మైనార్టీ గురుకుల విద్యాసంస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
గతంలో విద్యా అవకాశాలకు దూరంగా ఉన్న మైనార్టీ విద్యార్థులకు ఇప్పుడు అత్యాధునిక వసతులతో గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు, ఉచిత విద్య, భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మైనార్టీ యువత వైద్యులు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి మైనార్టీ కుటుంబం తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






Post a Comment