కామారెడ్డిలో నలుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు
మూడు దశాబ్దాల సేవలందించి పదవీ విరమణ
శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
పోలీసు శాఖలో మూడు దశాబ్దాలకు పైగా నిస్వార్థంగా, అంకితభావంతో ప్రజలకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న నలుగురు అధికారులకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అధికారులను, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు.
పదవీ విరమణ పొందిన అధికారులు:
1. ఎం.డి. ఉస్మాన్: ప్రస్తుతం సీసీఎస్, కామారెడ్డిలో ఎస్‌ఐగా 36 సంవత్సరాలు సేవలందించారు.
2. దత్తాద్రి గౌడ్: ప్రస్తుతం దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా 36 సంవత్సరాలు సేవలందించారు.
3. కె. శంకర్: ప్రస్తుతం బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్‌ఐగా 35 సంవత్సరాలు సేవలందించారు.
4. ఎస్.కె. అహ్మద్: ప్రస్తుతం రాజంపేట్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా 35 సంవత్సరాలు సేవలందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణే ధ్యేయంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విధులు నిర్వర్తించడం పోలీసు వృత్తిలో అత్యంత గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఈ అధికారులు చేసిన కృషి పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు.
ఈ నలుగురు అధికారులు కానిస్టేబుళ్లుగా తమ పోలీసు ప్రస్థానాన్ని ప్రారంభించి, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ శాఖకు విశిష్ట సేవలందించారని ప్రశంసించారు. వారి సేవా స్ఫూర్తి, వృత్తిపట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావం నేటి యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో కలిసి సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో, ఆనందమయ జీవితాన్ని గడపాలని జిల్లా ఎస్పీ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Post a Comment