Top News

SIR Review in Pitlam | పిట్లంలో SIR ప్రత్యేక సమీక్ష సమావేశం

పిట్లంలో SIR ప్రత్యేక సమీక్ష సమావేశం

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ దిశానిర్దేశం  

అర్హులందరినీ ఓటరు జాబితాలో చేర్చాలని సూచన

పిట్లం, తెలంగాణ డైలీ న్యూస్:  

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ SIR కార్యక్రమంపై కీలక సమీక్ష సమావేశం జరిగింది. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు, బీఎల్‌వోలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి SIR ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, ప్రజలకు కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించి ఎలాంటి అర్హుడు కూడా ఓటరు జాబితా నుంచి మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలుస్తూ SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబాన్ని సంప్రదించి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.  

సమావేశంలో SIR కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయడం, ఓటరు నమోదు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, పార్టీ శ్రేణులు, అధికారుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.  

జుక్కల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  పిలుపునిచ్చారు.



Post a Comment

Previous Post Next Post