Top News

Rytu Bharosa | రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

రైతుల ఖాతాల్లో నిధులు జమ

రామారెడ్డిలో కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్  

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు.  

రామారెడ్డి మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని మాట్లాడుతూ రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతులకు పెట్టుబడి వ్యయభారం తగ్గించడం, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.  

రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం రైతాంగానికి శుభపరిణామమని అన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయడం వల్ల పారదర్శకతతో పాటు సకాలంలో పెట్టుబడి అందే అవకాశం కలుగుతుందని తెలిపారు.  

జిల్లాలో 2025-26 వానాకాలం సీజన్‌లో 10,851 మంది రైతులకు రూ.9,35,33,533 రైతు భరోసా నిధులు జమయ్యాయని, అలాగే 2025-26 యాసంగి సీజన్‌లో 10,950 మంది రైతులకు రూ.7,34,81,576 ఆర్థిక సహాయం అందించామని కలెక్టర్ వెల్లడించారు. రెండు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో ఇప్పుడు నిధులు జమ అవుతాయని, మిగతావి 9 రోజుల్లో జమ అవుతాయని తెలిపారు.  

అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రైతు భరోసా సాయం అందేలా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దరఖాస్తులు, అర్హతల పరిశీలన, నిధుల జమ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.  

రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.  

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్‌వి గిరి, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, రామారెడ్డి ఉప సర్పంచ్ నవీన్, ఎంఈఓ, ఏడీఏ సుధా మాధూరి, సర్పంచ్ ప్రవీణ్, డీఏఓ మోహన్, తహసీల్దార్ ఉమలత, ఎంఏఓ భాను శ్రీ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post