ఆర్మూర్‌లో భారీ చోరీ కేసు ఛేదన
బాబాయ్ ఇంట్లో చొరబడి అబ్బాయ్ సూపారీ - రూ.31.48 లక్షల సొత్తు స్వాధీనం
ముగ్గురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ - సీపీ సాయి చైతన్య వెల్లడి
తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్: ఆర్మూర్ పట్టణంలో గత నెల 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తన సొంత బాబాయ్ ఇంట్లోనే చోరీకి సూపారీ ఇచ్చిన అబ్బాయ్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 31.48 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కమిషనర్ వెల్లడించిన వివరాలు
సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. గత నెల 24న ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో రూ. 41.31 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
చోరీ పథకం ఇలా...
ప్రధాన నిందితుడు విజయ్ అగర్వాల్ (ఏ1) తన బాబాయ్ కుటుంబ సభ్యులు వేములవాడ దేవస్థానానికి వెళ్లిన విషయం తెలుసుకున్నాడు. ఇదే అదనుగా భావించి చోరీకి పథకం వేశాడు. ఇందుకోసం సల్మాన్ ఖాన్ (ఏ2), మంజల్ సాయి కుమార్ (ఏ3), శ్రీహరి (ఏ4)లకు డబ్బు ఆశ చూపి సూపారీ ఇచ్చాడు. నిందితులు బాబాయ్ ఇంట్లో చొరబడి విలువైన వస్తువులు, నగదు దొంగిలించారు.
నిందితుల అరెస్ట్ - సొత్తు స్వాధీనం
ఆదివారం ఉదయం ఆర్మూర్ బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బయటపడింది. నిందితుల నుంచి 580 గ్రాముల 9 బంగారం ముద్దలు, 10 గ్రాముల బంగారం చైన్, 300 గ్రాముల 2 వెండి లక్ష్మి బిళ్ళలు, 50 గ్రాముల వెండి, రూ.19,33,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.31.48 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు.
ఏ2 సల్మాన్ రూ.1 లక్ష, ఏ3 మంజల్ సాయి కుమార్ రూ. 83,500 తమ అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న ఏ4 శ్రీహరి వద్ద రూ.8 లక్షలు ఉన్నాయని సీపీ వెల్లడించారు.
ప్రధాన నిందితుడిపై రౌడీ షీట్
ఏ1 విజయ్ అగర్వాల్ గతంలో 7 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈసారి అతనిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు సీపీ తెలిపారు.
కేసును ఛేదించిన ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సాయి నాథ్, అతని టీం, అమరేంధర్, హెచ్‌సీ కిరణ్ కుమార్, సతీష్ లను సీపీ సాయి చైతన్య అభినందించారు.

Post a Comment