7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం - జూన్ 11 డెడ్‌లైన్
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, 13 ఎఫ్ఐఆర్‌లు, భూకబ్జా ఆరోపణలు
కామారెడ్డి, జూన్ 4: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఎంపీ మల్లు రవి, శ్యామ్ మోహన్ సంయుక్త నోటీసు
డీఏసీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవి మరియు డీఏసీ ఉపాధ్యక్షుడు శ్యామ్ మోహన్ అనంతుల సంయుక్తంగా ఈ నోటీసు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలకు సంబంధించిన పత్రికా కథనాల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.
తీవ్ర ఆరోపణలు - 13 ఎఫ్ఐఆర్‌లు
పేలుడు పదార్థాలతో సంబంధించిన కేసు, మున్సిపాలిటీలోని పాత సామాను అమ్మిన కేసు, భూ కబ్జాలపై కేసుతో పాటు అతనిపై దాదాపు 13 ఎఫ్ఐఆర్‌లు, కేసులు ఉన్నాయని ఆరోపణలు వచ్చినట్లు నోటీసులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిటీ దృష్టికి వచ్చాయి.
సీనియర్ నేతపై వ్యాఖ్యలు
పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడిపై చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించాయనే ఆరోపణలు కూడా నోటీసులో ఉన్నాయి.
జూన్ 11లోగా వివరణ ఇవ్వాలి
తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి లిఖితపూర్వక వివరణను ఏడు రోజులలోగా, అంటే 11 జూన్ 2026 లోపు డీఏసీకి సమర్పించాలని నోటీసు ద్వారా ఆదేశించారు. ఫిర్యాదులు మరియు ప్రాతినిధ్యాల ప్రతులను కూడా నోటీసుకు జతచేసినట్లు టీపీసీసీ డీఏసీ వెల్లడించింది.
వివరణ అందిన అనంతరం పార్టీ నియమ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలపై కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ డీఏసీ షోకాజ్ నోటీసులు
ఫిర్యాదులపై స్పందించిన మల్లు రవి, శ్యాం మోహన్‌లకు నేతల కృతజ్ఞతలు
సస్పెండ్ చేయాలని కామారెడ్డి కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్
కామారెడ్డి, జూన్ 4: కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
డీఏసీ చైర్మన్ మల్లు రవికి వినతి
ఇటీవల కామారెడ్డి నియోజకవర్గ నాయకులు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి, ఉపాధ్యక్షుడు శ్యాం మోహన్‌లను కలిసి ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం సమర్పించారు. అందిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించిన కమిటీ, వివరణ కోరుతూ చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. నోటీసులో పేర్కొన్న అంశాలపై నిర్ణీత గడువులోగా లిఖితపూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించింది.
సస్పెండ్ చేయాలని డిమాండ్
ఈ సందర్భంగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణను పరిరక్షించడంలో డీఏసీ తీసుకున్న చర్యను పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. "గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఎంత తొందరగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తే, అంత తొందరగా పార్టీని కాపాడిన వాళ్లమవుతాం. ఆయనపై చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఆయన సస్పెన్షన్ నుండి తప్పించుకోలేరు" అని నాయకులు స్పష్టం చేశారు.
పీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి
ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా స్పందించి చర్యలు తీసుకున్నందుకు డీఏసీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి, ఉపాధ్యక్షుడు శ్యాం మోహన్‌లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు విజ్ఞప్తి చేస్తూ, తాము ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కామారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
ధన్యవాదాలు తెలిపిన వారిలో కామారెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Post a Comment