![]() |
| జిల్లా కమిటీ ని సన్మానించిన బాన్సువాడ ప్రెస్ క్లబ్ సభ్యులు |
నియమావళి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కామారెడ్డి శాఖకు సూచన
12న మహాసభ - సభకు వారం రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి : రాష్ట్ర కమిటీ
ప్రతీ ఒక్కరు సభ్యత్వ నమోదులో పాల్గొనాలి: రజనీకాంత్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: టీయూడబ్ల్యూజే కామారెడ్డి జిల్లా కమిటీని బాన్సువాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. బుధవారం బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఏ. లతీఫ్, జిల్లా అధ్యక్షులు రజనీకాంత్‌లను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు.
రాష్ట్ర కమిటీ లేఖ - కామారెడ్డి శాఖకు ప్రశంస
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే/ఐజేయు) రాష్ట్ర కమిటీ కామారెడ్డి జిల్లా శాఖకు లేఖ రాసింది. జిల్లా సభలను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి జరుపుతున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ సంయుక్త ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా సభలకు హాజరు సంతృప్తికరం
ఇప్పటివరకు జరిగిన సభలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయని, ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని జిల్లాల్లో సభ్యుల హాజరు సంతృప్తికరంగా ఉందని లేఖలో పేర్కొంది. సభల విజయవంతం వెనక జిల్లా నాయకత్వాల కృషి ఉన్నందున వారిని రాష్ట్ర కమిటీ అభినందిస్తోందని తెలిపింది.
ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘం
కార్మిక శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా, సంఘం నియమావళిని గౌరవిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘ కార్యకలాపాలను కొనసాగించే ఏకైక సంఘం రాష్ట్రంలో తమదేనని రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. 33 జిల్లాల్లో కమిటీలు కలిగి సంస్థాగత నిర్మాణయుతంగా పనిచేస్తున్నామని పేర్కొంది.
జూన్ 12న మహాసభ - ఎన్నికల ప్రక్రియపై సూచనలు
మహా సభకు వారం రోజుల ముందే ఎన్నికల అధికారిని నియమించి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర కమిటీ సూచించింది. అధ్యక్ష కార్యదర్శితో పాటు కోశాధికారి, ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు సహాయ కార్యదర్శులు, 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలని తెలిపింది. మహాసభ రోజే హడావిడిగా ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని, నామినేషన్లు, ఉప సంహరణలు, స్క్రూటినీ ప్రక్రియలను ముందే పూర్తి చేయాలని సూచించింది.
జూన్ 12న కళా భారతిలో మహాసభ
జూన్ 12న మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డిలోని కళా భారతి ఆడిటోరియంలో మహాసభ ప్రారంభం అవుతుందని, జిల్లా వ్యాప్తంగా సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ కోరారు.
సభ్యత్వ నమోదు జూన్ 4లోగా పూర్తి చేయాలి
జిల్లాలో విస్తృతంగా సభ్యత్వ నమోదు చేస్తున్నామని, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలోని సభ్యులు ఈ నెల 4 లోగా సభ్యత్వం పొందాలని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. బాన్సువాడలో రాష్ట్ర కమిటీ సభ్యులు లతీఫ్‌ను కలిసి సభ్యత్వ నమోదు, ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాసులు, యూనియన్ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, శంకర్ పటేల్, బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, కార్యదర్శి చంద్రశేఖర్, జర్నలిస్టులు సుభాష్, రాజేశ్వర్ రెడ్డి, సుధాకర్, అహ్మద్, సలీం, యూనుస్, సుధీర్, హన్మాండ్లు, మధుసూదన్ రెడ్డి, నబీ, ఇలియాజ్, రవి, సుందర్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment