బీసీలకు ద్రోహం చేస్తున్న మోడీ - బీసీల కోసం ఆలోచిస్తున్న రాహుల్, రేవంత్ రెడ్డి
కులగణన కోసం తెలంగాణలో రూ.150 కోట్లు కేటాయింపు
మీడియాతో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి. హన్మంత్ రావు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీ బీసీ అయి ఉండి కూడా బీసీలకు ద్రోహం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి. హన్మంత్ రావు విమర్శించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి మూడు సార్లు ప్రధాని అయిన నరేంద్ర మోడీ బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. అగ్ర కులానికి చెందిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాత్రం బీసీల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు.
దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ, ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలు ఎక్కువగా ఉన్నారని, వారు తీవ్రంగా నష్టపోతున్నారని గమనించారని తెలిపారు. అందుకే బీసీల లెక్క తేల్చాలని నిర్ణయించారని, దేశవ్యాప్తంగా కులగణన జరగాలని పట్టుబట్టారని చెప్పారు.
జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం జరగాలని కోరడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణన చేపట్టడానికి నిర్ణయించిందని, అయితే జనగణనలో కులగణన వద్దని మెలిక పెట్టిందని ఆరోపించారు. కులగణన చేపడితే బీసీల లెక్క తేలుతుందని, ఈ విషయమై కోర్టుకు వెళ్తే కులగణన చేయాల్సిందేనని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కులగణన చేయాలని నిర్ణయించి రూ.150 కోట్లు కేటాయించారని, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందాక ఫైల్ ను గవర్నర్ కు పంపారని వివరించారు.
బీజేపీకి ఎన్నికల్లో గెలవాలి, దేశాన్ని హిందూదేశంగా మార్చాలన్నదే లక్ష్యమని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఈసీలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వాలను పడగొట్టేందుకు వాటిని వాడుకుంటోందని ఆరోపించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ మొత్తుకున్నా ఈసీ స్పందించలేదని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో సర్ ద్వారా ఓటర్ల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ప్రతి ఒక్కరు సర్ లో భాగస్వామ్యం కావాలని, తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మహమ్మద్ నయీమ్, ఐరేని సందీప్, పండ్ల రాజు, గంప ప్రసాద్, కారంగుల అశోక్ రెడ్డి, భూమని బాలరాజ్, పుట్నాల శ్రీనివాస్, గొడుగుల శ్రీనివాస్, కౌన్సిలర్లు అంజాద్, ఇసాక్ షేరు, సుతారి రమేష్, మహమ్మద్ సలీం, జావిద్, వాజిత్, ఆమీర్ లడ్డు, కళ్లెం సత్యం, గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, సిరాజ్, కన్నయ్య, కాళ్ల గణేష్, ముబాషిర్, యూనిస్, అన్వర్ అహ్మద్, లక్ష్మీ రాజా గౌడ్, కిరణ్, ప్రవీణ్ రాజ గౌడ్, ఖుర్షీద్, టింకు భరత్, సురేష్, సుఫియాన్, జ్యోతి, కార్యాలయ కార్యదర్శి లక్కపత్తిని గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment