బాసర ఆలయ దొంగతనం కేసును ఛేదించిన నిర్మల్ పోలీసులు
1.48 కిలోల వెండి కిరీటం స్వాధీనం, ముగ్గురు అరెస్టు
10 రోజుల్లోనే కేసు పరిష్కారం, నిందితులపై 25, 20 కేసులు
ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చర్యలు
నిర్మల్, తెలంగాణ డైలీ న్యూస్:
నిర్మల్ జిల్లా బాసర మహంకాళి ఆలయంలో జరిగిన దొంగతనం కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలతో పాటు దొంగిలించిన సొత్తును స్వీకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. సుమారు 1.48 కిలోగ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు.
నేరం జరిగిన వెంటనే ఆరు ప్రత్యేక బృందాలు నాందేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బాసర పోలీస్ స్టేషన్, సీసీఎస్ సిబ్బంది సమన్వయంతో సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు నిర్వహించి, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి వెండి కిరీటం, హుండీని దొంగిలించిన ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను, సొత్తును స్వీకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
జూన్ 22న గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణ గోడదూకి ఆలయంలోకి చొరబడి గేటు తాళాలు పగులగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీని దొంగిలించారు. అనంతరం హుండీలోని సుమారు రూ.16వేల నగదును తీసుకొని, వెండి కిరీటాన్ని రెండు భాగాలుగా విడదీసి అమ్మవారి ఆలయం వెనక గుట్టల పైనుండి పరారయ్యారు. మామూలు భక్తుల్లా రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు.
దొంగిలించిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు నిజామాబాద్‌కు చెందిన కోడామ ఆనంద్ సహకారంతో మహారాష్ట్రలోని నాందేడ్‌కు తీసుకెళ్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం కాచిగూడ–నాగర్సోల్ రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురిని బాసర రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎక్కువగా రైల్వే సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోని ఆలయాలు గుర్తించి దొంగతనాలు చేస్తున్నారని గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తులో 1.220 కిలోగ్రాముల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీ, మొబైల్ ఫోన్ ఉన్నాయి. నిందితుల్లో గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు 25 కేసుల్లో, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణ 20 దొంగతనం కేసుల్లో నిందితుడని పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. దీపక్, నిర్మల్ టౌన్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, హెడ్ కానిస్టేబుల్ ఖాలీద్, పోలీస్ కానిస్టేబుళ్లు భీమేష్, మోహన్, నరేందర్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ జగన్ సింగ్, పోలీస్ కానిస్టేబుల్ తిరుపతి, హోంగార్డ్ సతీష్‌లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.


Post a Comment