Top News

Collector's Visit | నిజాంసాగర్, పెద్దకొడప్గల్, ఎల్లారెడ్డి మండలాల్లో కలెక్టర్ పర్యటన

నిజాంసాగర్, పెద్దకొడప్గల్, ఎల్లారెడ్డి మండలాల్లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటన  

నిజాంసాగర్ ప్రాజెక్టులో 6 టీఎంసీల నీరు నిల్వ, రైతులకు నీటి విడుదలకు ఆదేశం  

రూ.9.90 కోట్ల ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి  

బుర్గుపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం, ఎస్‌ఐఆర్ కార్యక్రమం పరిశీలన  

జుక్కల్/ఎల్లారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలను పరిశీలించారు.  

మధ్యాహ్నం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి డ్యాంలోని ప్రస్తుత నీటి నిల్వల పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరాల ప్రకారం ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 6.00 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వర్షాకాల వ్యవసాయ సీజన్‌లో నారుమడులు, పంటల సాగుకు అవసరమైన మేర నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  

నిజాంసాగర్ సమీపంలో ఎకో టూరిజం ప్రాజెక్టు కింద నిర్మాణంలో ఉన్న కాటేజీలు, లగ్జరీ సూట్లు, డీలక్స్ గదులను పరిశీలించారు. సుమారు రూ.9.90 కోట్ల వ్యయంతో 7 డీలక్స్ గదులు, 10 సూట్ల నిర్మాణం జరుగుతోంది. పనులను వేగవంతం చేసి ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామని పర్యాటక శాఖ డిప్యూటీ ఇంజనీర్ తెలిపారు.  

పెద్దకొడప్గల్ మండలం బుర్గుపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల ఇంటి నిర్మాణ ప్రారంభ హౌస్ మార్కింగ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద పూర్తయిన ఒక గృహాన్ని ప్రారంభించి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

అనంతరం బుర్గుపల్లిలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, బీఎల్‌వో యాప్ ద్వారా ఫారమ్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.  

ఈ పర్యటనలో బాన్సువాడ ఆర్డీవో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, పర్యాటక శాఖ డిప్యూటీ ఇంజనీర్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, మిషన్ భగీరథ డివిజనల్ ఇంజనీర్, సీడీపీఓ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల విద్యాశాఖ అధికారి, వైద్యాధికారి, పంచాయతీరాజ్, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ, పర్యాటక శాఖల అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.  





మాచాపూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

కేంద్రం పునరుద్ధరణకు రూ.50 వేల నిధులు మంజూరు  

చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి  

ఎల్లారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ పంచాయతీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం సందర్శించారు. కేంద్రంలోని చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  

అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార నిల్వలు, రికార్డులను పరిశీలించి, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను తనిఖీ చేశారు. కేంద్ర భవనానికి మరమ్మతులు అవసరమని గుర్తించి తక్షణ పునరుద్ధరణ పనుల కోసం రూ.50 వేల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులను వెంటనే ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  

గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ అన్నారు. ప్రతి కేంద్రంలో పిల్లలకు నాణ్యమైన పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.  

అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని, చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు.  

ఈ కార్యక్రమంలో సీడీపీఓ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, తహసీల్దార్, ఎంపీడీఓ, అంగన్‌వాడీ టీచర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.  

శబ్దల్పూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్  

సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలి  

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంచాలి  

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశం  

ఎల్లారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

ఎల్లారెడ్డి మండలం శబ్దల్పూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం పర్యటించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ నాణ్యత, బిల్లుల చెల్లింపుల పరిస్థితిపై ఆరా తీశారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  

అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచి ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా చూడడమే ఇటువంటి పర్యటనల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.  

ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.  

ఈ పర్యటనలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్, తహసీల్దార్, ఎంపీడీఓ, అసిస్టెంట్ ఇంజనీర్, సంబంధిత శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post