Top News

Collector | పుస్తక జ్ఞానానికి సామాజిక స్పృహ తోడు కావాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా



పుస్తక జ్ఞానానికి సామాజిక స్పృహ తోడు కావాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా  

సోన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ  

విద్యా బోధన, వసతి, ఆహారం, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలన  

పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి, జవాబు పత్రాల పరిశీలన  

నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత పాటించాలని మెస్ కమిటీకి ఆదేశం  

ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవాలని విద్యార్థులకు సూచన  

నిర్మల్, తెలంగాణ డైలీ న్యూస్:  

విద్యార్థులు పుస్తకాల్లోని పాఠాలను నేర్చుకోవడం మాత్రమే కాకుండా వాటిని సమాజంలో జరుగుతున్న పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.  

గురువారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధన, వసతి, ఆహారం, పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.  వీడియో 👇



తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. అనంతరం వంటశాల, సరుకుల నిల్వ గది, భోజనశాలను తనిఖీ చేసి అక్కడి పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.  

మెస్ కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నాణ్యమైన కూరగాయలు, ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని, వంటశాలలో పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు, స్టాక్ రిజిస్టర్‌ను క్రమం తప్పకుండా నవీకరించాలని సూచించారు.  

పదో తరగతి గదికి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి జవాబు పత్రాలను పరిశీలించి, గణితం, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించారు. కొంతమంది విద్యార్థులను బోర్డుపై లెక్కలు చేయించి, సమస్యల పరిష్కార విధానాన్ని వివరింపజేశారు.  

శాస్త్రవేత్తల కృషి, విజ్ఞాన శాస్త్రం సమాజ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్ర గురించి వివరించి, పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమకాలీన సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.  

ప్రశ్నలు అడిగే అలవాటును విద్యార్థులు పెంపొందించుకోవాలని, ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడం, పుస్తక పఠనం చేయడం ద్వారా విజ్ఞానాన్ని విస్తరించుకోవాలని కలెక్టర్ సూచించారు. సృజనాత్మకత, ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉన్నత లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ప్రత్యేక అధికారి సుధాకర్, తహసీల్దార్ సంతోష్, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post