బీసీ జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం బంద్ విజయవంతం
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది: విద్యార్థి నేతలు ఆరోపణ
నాలుగేళ్లుగా 7 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించలేదని ఆవేదన
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
నేడు బీసీ జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షుడు, కార్యదర్శి విజయ్ కుమార్, రాఘవేంద్ర మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుండి 7 వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకుండా ఇప్పుడు చెల్లిస్తాం, అప్పుడు చెల్లిస్తాం అంటూ కాలం వెళ్లదీస్తోందని అన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోందని తెలిపారు.
ఫీజుల బకాయిలను ఎప్పుడు ఇస్తుందో చెప్పకుండా ఒకవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, ఇంటర్ అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల నుండి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు తీర్పులు వస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో దిగి రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విట్టల్, రాజు, శివకుమార్, బాబు, చరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment